ఈఎన్ఈ రిపీట్ మూవీ నుంచి బతుకమ్మ సాంగ్ రిలీజ్...

ఈఎన్ఈ రిపీట్ మూవీ నుంచి బతుకమ్మ సాంగ్ రిలీజ్...

విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి లీడ్ రోల్స్‌‌లో తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం ‘ఈఎన్‌‌ఈ రిపీట్‌‌’. సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించారు.  నవంబర్ 19న సినిమా రిలీజ్.  ప్రమోషన్స్‌‌లో భాగంగా గురువారం ‘బతుకమ్మ’ అనే పాటను లాంచ్ చేశారు. వివేక్ సాగర్ కంపోజ్ చేయగా చంద్రబోస్  సాహిత్యం అందించారు.  శ్రేయా ఘోషల్ పాడారు. సాంగ్ లాంచ్ ఈవెంట్‌‌లో దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ‘ఇదొక ఫెస్టివల్ సాంగ్. 

ఈ పాట సినిమాలో ఎందుకు ఉందనేది థియేటర్స్‌‌లో చూస్తారు.  శివాత్మికను ఇందులో కీర్తన పాత్రలో పరిచయం చేస్తున్నాం. తన డ్యాన్స్ కూడా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులంతా ఈ పాటను ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు.   గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ ‘ఇప్పటివరకూ దాదాపు 3900 పాటలు రాశా.  అందులో 250కి పైగా పాటలను శ్రేయా ఘోషల్ అద్భుతంగా పాడారు. అయితే ఈ ‘బతుకమ్మ’ పాట మాత్రం వినూత్నంగా ఉంటుంది. 

ఆమె చాలా కొత్తగా పాడారు. స్వేచ్ఛా ధోరణి, స్వతంత్ర దృక్పథం ఉన్న కీర్తన అనే ఈ తరం అమ్మాయి తనలోని కోరికలు, ఆశలు, ప్రశ్నలను బతుకమ్మతో ముచ్చటించుకోవడం, బతుకమ్మను అడగడమే ఈ పాట సారాంశం’ అని చెప్పారు. కీర్తన అనే మంచి పాత్రతో పాటు ఇలాంటి గొప్ప పాట కూడా దొరకడం  ఆనందంగా ఉందని శివాత్మిక చెప్పింది.  నటులు శ్రీనాథ్ మాగంటి,  అభినవ్ గోమఠం, శ్రీరామచంద్ర, నిర్మాతలు సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.