జాజుల శ్రీనివాస్ స్థాయికి మించి మాట్లాడుతున్నడు

జాజుల శ్రీనివాస్ స్థాయికి మించి మాట్లాడుతున్నడు
  • తీరు మార్చుకోకపోతే రాళ్లతో కొడతాం 
  • బీసీ సంఘాల నేతలు హెచ్చరిక 

బషీర్​బాగ్​, వెలుగు: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను విమర్శించే నైతిక హక్కు బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ కు లేదని పలు బీసీ సంఘాల నాయకులు అన్నారు. వేలాది ఉద్యమాలతో జీఓలు తీసుకువచ్చి కోట్లాది మందికి విశేష సేవలు అందించిన ఆర్.కృష్ణయ్యను జాజుల విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సోమవారం సమావేశం నిర్వహించారు. బీసీ విద్యార్థి, యువజన సంఘం అధ్యక్షుడు రాంమూర్తిగౌడ్ మాట్లాడుతూ.. జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇటీవల ఓ సమావేశంలో తన స్థాయికి మించి మాట్లాడారని, ఆర్.కృష్ణయ్యపై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. 

ఇలాగే వ్యవహరిస్తే దేహశుద్ధి తప్పదని, రాళ్లతో దాడి చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కృష్ణయ్య ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదని, రాజకీయ పార్టీలే పిలిచి ఆయనకు పదవులు ఇచ్చాయని చెప్పారు. ఓర్వలేక, అధికార పార్టీలతో అంటకాగుతూ జాజుల తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాత్రిళ్లు డబ్బుల సంచులు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. తక్షణమే ఆర్.కృష్ణయ్యకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.