
- డిపోల నుంచి కదలని ఆర్టీసీ బస్సులు... ర్యాలీ నిర్వహించిన వివిధ పార్టీల నాయకులు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నిర్వహించిన బంద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు ప్రకటించి బంద్‌లో పాల్గొన్నారు. బంద్‌లో భాగంగా స్కూళ్లు, కాలేజీలు, వ్యాపార, వాణిజ్య సముదాలను ముందుగానే మూసివేశారు. రాజకీయ పార్టీల నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు ఉదయమే బస్టాండ్ల వద్దకు చేరుకొని బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.
కామారెడ్డిలో వివిధ సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించి, నిజాంసాగర్ చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేశారు. బోధన్‌లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన అనంతరం పాత బస్టాండ్, హనుమాన్ మందిరం, సర్కార్ హాస్పిటల్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. బంద్ సందర్భంగా పలువురు లీడర్లు మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్ అమలు చేసే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. బంద్ కారణంగా సాయంత్రం వరకు ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి బస్‌లు నడువగా, దుకాణాలను ఓపెన్ చేశారు. - వెలుగు నెట్‌వర్క్