సమాజంలో సగమున్న బీసీల లెక్కలు తీయాలె

సమాజంలో సగమున్న బీసీల లెక్కలు తీయాలె

సమాజంలో సగం.. అవకాశాల్లో అథమం అన్నట్టుగా ఉంది బీసీల పరిస్థితి. జనాభా ప్రకారం వీరికి చట్టసభల్లో ఎన్నడూ ప్రాతినిథ్యం ఉండట్లేదు. సంక్షేమం పేరుతో బీసీ కులాలను సేవకులు, బానిసలుగానే ఉండేలా చేస్తూ.. అధికారంలోకి రానివ్వకుండా ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయి. పార్టీలు ఏవైనా.. అధికారం దక్కించుకోవడం కోసం బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తున్నాయి. జనాభాలో 55 శాతం ఉన్న బీసీలు దశాబ్దాలుగా పాలితులుగానే ఉంటున్నారు. ఎప్పుడూ కొన్ని వర్గాలె పాలకులుగా చట్టసభలకు వెళ్తున్నారు. వచ్చే జనాభా లెక్కల్లో కులాల వారీగా బీసీల జనగణన చేపట్టాల్సిందే. అప్పుడే బీసీల అసలు లెక్క తేలుతుంది. జెండాలు కట్టడానికి, దండాలు పెట్టడానికే బీసీలు పరిమితం కారనే చైతన్యం పెరిగి దక్కాల్సిన హక్కుల కోసం పోరాటం మొదలవుతుంది.

పాలకులకు అధికార కాంక్ష తీరడం లేదు. అందుకే రాజ్యాంగం, ప్రజాస్వామ్య లక్ష్యాలను పక్కనబెట్టి పాలన సాగిస్తూ.. బలహీన వర్గాల మీద స్వారీ చేస్తున్నారు. సంక్షేమ రాజ్యం, శ్రేయో రాజ్యం, సామ్యవాద ఉద్దేశాలు బలహీన వర్గాలు, బీసీల మీద కక్ష కట్టాయా అన్నట్లు ఈ దేశంలో మెజారిటీ బీసీలంతా ఏండ్లుగా పాలితులుగానే మిగిలిపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రతీసారి కొన్ని వర్గాలే పాలకులుగా ఉంటున్నారు. ఇది ఏరకమైన ప్రజాస్వామ్యం?. స్వాతంత్ర్యం సిద్ధించి 72 ఏండ్లు గడుస్తున్నా బీసీల జనాభా లెక్కా పత్రం లేకపోవడం వారిని లెక్కలోకి తీసుకోకపోవడమే కదా. 55 శాతానికి పైగా ఉన్న బీసీలకు పాలనతో పాటు ఏ రంగంలోనూ జనాభా ప్రకారం అవకాశాలు కల్పించకపోవడం ద్వారా పాలకులు ఏ రకమైన సంకేతం ఇవ్వదలుచుకున్నారో ప్రశ్నించాల్సిందే. వేళ్ల మీద లెక్కపెట్టే  పాలక కులాలే ఎప్పుడూ.. చట్ట సభలకు వెళ్లడం ద్వారా ప్రజాప్వామ్యం ఎలా పరిపుష్టం అవుతుంది. వడ్లకు, బియ్యానికి తేడా తెలియనోళ్లు, కులాల గురించి  అవగాహన లేనివాళ్లు, క్రిమినల్స్​కు దేశ చట్టసభలు ఇంకా ఎన్నాండ్లు వేదికగా ఉండాలె. రెవెన్యూ రికార్డుల ప్రకారం చెట్లకు, పుట్టలకు, గుట్టలకు లెక్కలున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు లెక్కలు ఉన్నాయి. సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలకు లెక్కలు లేకపోవటం పాలకుల లెక్కలేని తనానికి నిదర్శనం. మండల్ కమిషన్, కాకా కాలేల్కర్ కమిషన్లు బీసీ కులాలను లెక్కించాలని సిఫారసు చేశాయి. శాస్త్రీయ లెక్కల వల్ల మానవ వనరుల అభివృద్ధితోపాటు, సంక్షేమ కార్యక్రమాలను సరిగా అమలు చేయొచ్చని, బీసీలకు చట్టసభల్లో రాజకీయ అవకాశాలు కల్పించవచ్చని తెలిపాయి. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా.. బీసీల పరిస్థితి మాత్రం మారడం లేదు.
 
ఓహో.. అందుకే లెక్కించట్లేదా? 

కులాల వారీగా బీసీల లెక్క తేలితే.. సామాజికంగా, రాజకీయంగా దక్కాల్సిన హక్కులు దక్కడం లేదని, దోపిడీకి గురవుతున్నామని వారికి తెలిసిపోతుంది. అందుకే పాలకులు కులాల వారీగా జనగణనకు వెనకడుగు వేస్తున్నారు. మేం ఇంత మంది జనాభా ఉన్నం.. మా వాటా మాకు కావాల్సిందేనని ఎక్కడ ప్రశ్నిస్తారోనని భయం వారిని వెంటాడుతోంది. మెజారిటీ ఓబీసీ కులాలను కొన్ని కులాలు పాలిస్తున్నాయనే బండారం బయటపడితే వారి ఉనికికే ప్రమాదం. అందుకే పాలకులు అంత తేలిగ్గా కులాలవారీగా బీసీలను లెక్కించేందుకు ముందుకు రావడం లేదు. దేశంలో మూడు వేలకు పైగా బీసీ కులాలు ఉన్నాయి. వాటిలో పదుల సంఖ్యలో కూడా చట్టసభల్లో ప్రాతినిథ్యం ఉండట్లేదు. బీసీలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా తెలుసుకోలేకపోవడం వల్లే పాలకుల ఆటలు ఇంకా సాగుతున్నాయి. కులాల వారీగా లెక్క తేలితే చట్టసభల్లో రిజర్వేషన్లు అడిగే అవకాశం ఉంటుంది. జనాభా ప్రకారం బీసీలకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తే పాలక కులాలు తమ ఉనికి కోల్పోతాయని భావిస్తున్నాయి. బీసీ జనాభా ప్రకారం పార్లమెంట్​లో దాదాపు 272 మంది బీసీ ఎంపీలు ఉండాలి. కానీ అందులో పావు వంతు కూడా లేరు. ఐదు ఆరు శాతం జనాభా ఉన్న అగ్రవర్ణ వర్గాలె ఆ స్థానాలను ఆక్రమించుకుంటున్నాయి. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో బీపీ మండల్ సిఫారసు చేసిన 27 శాతం రిజర్వేషన్లు కూడా అమలు కావడం లేదు. ఆరు నుంచి 1-2 శాతం ఉన్న కులాలు 55 శాతం ఉన్న బీసీ కులాలను పాలించడమేంటని? బీసీలు ప్రశ్నిస్తున్నారు. బీసీ కులాలను సేవకులుగా, రాజకీయ బానిసలుగా ఇంకా కొనసాగించేందుకే కులాల వారీగా బీసీ జనగణన చేయడం లేదనే విషయం స్పష్టమవుతోంది. ఈ వివక్షలన్నింటికీ బీసీ కులగణనతో కొంత పరిష్కారం దొరకనుంది. 

బీసీ ఉద్యమాల వైఫల్యం..  

బీసీలు రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందకపోవడానికి పాలకులు, ప్రభుత్వాల నిర్లక్ష్యం ఒక కారణమైతే,  బీసీ ఉద్యమాల వైఫల్యం కూడా మరో కారణం. సరైన నాయకులు లేక బీసీ ఉద్యమాలు లక్ష్యాన్ని చేరడం లేదు. ఆ మధ్య ఓ బీసీ నాయకుడు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు అఫిడవిట్​లో కోట్ల ఆస్తులు చూపించడంతో అంతా ఆశ్చర్యపోయారు. పట్టుబట్టి పోరాడాల్సిన నాయకుడు పత్రికలు, మీడియాలో వచ్చేందుకే బీసీ ఉద్యమాన్ని పరిమితం చేస్తే లక్ష్యం ఎలా నెరవేరగలదు. ఉద్యమం పేరుతో వ్యక్తిగత ఎదుగుదల కోసం పార్టీల పంచన చేరుతూ.. ఉద్యమాన్ని పణంగా పెడితే బీసీలకు న్యాయం ఎలా జరుగుతుంది. పాలకులు బీసీలకు అవకాశాలు ఇవ్వకపోవడానికి కారణం బీసీలు బలమైన ఉద్యమశక్తిగా మారకపోవడమే. సంవత్సరాలుగా ఎదిగిన నాయకులే సీట్ల కోసం ఎగబడి పార్టీలు మారితే, చిన్నా, చితకా బీసీ నాయకులను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. వీళ్ల వల్ల బీసీలకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోంది. ఇప్పటికైనా బీసీ కులాలు మేల్కోవాలి. పాలకులు, ప్రభుత్వాలు కులాల వారీగా లెక్కించకుండా చేస్తున్న మోసాన్ని పసిగట్టి జనాభా ప్రకారం దక్కాల్సిన వాటా కోసం కొట్లాడాలె. బీసీ సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం కులాల వారీగా బీసీ గణన చేపట్టాలని కేంద్రానికి లేఖ రాయాలె. ఈ డిమాండ్​పై ఎంపీలతో పార్లమెంట్​లో గట్టిగా ప్రశ్నించేలా చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

                                                                                     ... సాధం వెంకట్,సీనియర్ జర్నలిస్టు
    
అదనపు ఖర్చేమీ ఉండదు..

వచ్చే సెన్సెస్​లో బీసీల జనగణన కులాల వారీగా జరగాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కులగణనను జనాభా లెక్కల్లో చేర్చకపోవడాన్ని బీసీలు ఆత్మగౌరవ సమస్యగా భావిస్తున్నారు. బ్రిటీష్ కాలంలో1871–72లో మొదటిసారిగా జనగణన మొదలైంది. 1881 నుంచి  1931 వరకు కులాల వారీగా గణన జరిగింది. స్వాతంత్ర్యానంతరం బీసీలను కులాల ప్రకారం లెక్కించకుండా కేవలం జనాభానే లెక్కిస్తున్నారు. దీనికి పాలకులు చెప్పే కుంటి సాకులు ఏమిటంటే, కులగణన వల్ల సమాజంలో ద్వేషం పెరుగుతుందని, గొడవలు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతోంది. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. పాలక కులాలు ఆధిపత్యం కోసం వివక్షతోనే బీసీలను కులాల వారీగా జనాభా లెక్కలో చేర్చడం లేదు. ప్రతి పదేళ్లకు ఒకసారి దేశంలో జనాభా లెక్కలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇందుకు దాదాపు రూ.1100 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. అయితే జనాభా లెక్కల్లో భాగంగా బీసీల కులగణన చేయడం వల్ల అదనంగా ఖర్చు ఏమీ ఉండదు. 31 కాలాలు ఉన్న షీట్​లో ఒక కాలమ్​ అదనంగా పెరుగుతుంది.