- బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
నల్గొండ, వెలుగు: బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తేలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం నల్గొండ పట్టణ కేంద్రంలో క్లాక్ టవర్ వద్ద మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఈసారి జరిగే పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు విద్యా, ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమం చేస్తామన్నారు.
రాష్ట్ర సర్కార్ బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ జీవో నెంబర్ 9 విడుదల చేసిందని, ఈ జీవోను వ్యతిరేకిస్తూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కోర్టులను వేదికగా చేసుకుని అడ్డుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ అగ్ర కులాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు జరిగినప్పుడు బీసీలకు జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఎందుకు ఉండవని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 24 నుంచి చలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా పార్లమెంటును దిగ్బంధిస్తామని ఆయన హెచ్చరించారు. చక్రహరి రామరాజు, దుడుకు లక్ష్మినారాయణ, తండు సైదులు గౌడ్, సుంకరి మల్లేష్ గౌడ్, తీర పంకజ్ యాదవ్, రామరాజు, చిలకరాజు చెన్నయ్య, చొల్లేటి ప్రభాకర్ పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ సాధించేవరకు ఉద్యమం ఆగదు
సూర్యాపేట, వెలుగు: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ సాధించే వరకు ఉద్యమం ఆగదని మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, ప్రముఖ వైద్యుడు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ అన్నారు. గురువారం రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చలమల్ల నరసింహ అధ్యక్షతన మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీ జనాభా పది సంవత్సరాల్లో గణనీయంగా పెరిగిందని ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన లెక్కల్లో పది శాతం తగ్గించి చూపించారన్నారు.
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కాదని రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీలకు 60 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు బైరు వెంకన్న గౌడ్, అప్పం శ్రీనివాస్ రావు, నల్లగుంట్ల అయోధ్య, ఆకుల లవకుశ, బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, దంతాల రాంబాబు, నరేందర్, కోన మల్లయ్య, తప్పెట్ల శ్రీరాములు, నిద్ర సంపత్, నారబోయిన కిరణ్, నాయకులు పాల్గొన్నారు.
