బీఆర్ఎస్​లో బీసీ లీడర్ల లొల్లి

బీఆర్ఎస్​లో బీసీ లీడర్ల లొల్లి
  • మునుగోడులో ప్రభాకర్ రెడ్డిని మార్చాలని నేతల రహస్య భేటీ
  • జనగామలో మండల శ్రీరాములు బలప్రదర్శన 
  • చాలా చోట్ల కుల సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు 
  • రెబల్స్​గా పోటీకి బీసీ నేతలు రెడీ  

బీఆర్ఎస్​ పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు ఆశించిన చాలా మంది బీసీ లీడర్లకు ఆశలు అడియాసలయ్యాయి. సిట్టింగులకే టికెట్లు ఇవ్వడంతో ఆయా చోట్ల బీసీ లీడర్లు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. కుల సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు, బలప్రదర్శనల తో హల్​చల్ చేస్తున్నారు. పార్టీలు మారడం లేదంటే రెబెల్స్ గా రంగం లోకి దిగి పోటీ చేయడం గురించి మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు బీసీలకు ఇచ్చిన అరకొర సీట్లకు కూడా అగ్రవర్ణాల నేతలు పొగ పెడ్తున్నారంటూ బీసీ లీడర్లు భేటీ అయి తీర్మానాలతో పార్టీ హైకమాండ్​కు అల్టి మేటాలు సైతం  జారీ చేస్తున్నారు.  

నల్గొండ/జనగామ, వెలుగు : జనగామ ఎమ్మెల్యే టికెట్ ను బీసీ వర్గానికి చెందిన తనకు కేటాయించాలని డిమాండ్​చేస్తూ ఆప్కో మా జీ చైర్మన్, బీఆర్ఎస్ స్టేట్ లీడర్ మండల శ్రీరాములు ఆదివారం జనగామలో బల ప్రదర్శన చేపట్టారు. పట్టణంలో పార్టీ క్యాడర్, బీసీ అనుబంధ కులాలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్ఎంఆర్ గార్డెన్ లో భారీ సభ నిర్వహించి మాట్లాడారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలకు మించిన ప్రోటోకాల్ తో పదవుల్లోనే ఉన్నారని, మళ్లీ ఎమ్మెల్యే టికెట్ అడగడం తగదన్నా రు. 

ఇప్పటికే పరాయి పాలనలో ఉండి విసుగు చెందిన జనగామ ప్రజలు స్థానిక నేతలను కోరుకుంటున్నారని అన్నారు. స్థానికుడైన తనకు టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జనగామపై పల్లా, పోచంపల్లిలు ఆశలు వదులుకోవాలని, స్థానికులకు టికెట్ వచ్చేలా సహకరించాలని కోరారు. తనకు టికెట్ ఇచ్చేందుకే ఆ స్థానాన్ని పెండింగ్ లో పెట్టారన్నారు. కార్యక్రమంలో నేతలు వజ్జ పరుశరాములు, దోర్నాల వెంకటేశ్వర్లు, మంగళంపల్లి జనార్ధన్, గుర్రం నాగరాజు, బాలనర్సయ్య, శ్రీనివాస్,​ ఎస్​కే రాజు, బైరి బాబు పాల్గొన్నారు.  

మునుగోడు బీసీ లీడర్ల భేటీ 

మునుగోడు టికెట్​ను ప్రభాకర్​రెడ్డికి కేటాయించడాన్ని నిరసిస్తూ మునుగోడు జడ్పీటీసీ నారబోయిన రవి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్, రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ చాంబర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెన్ రెడ్డి రాజు, బీఆర్ఎస్ స్టేట్ లీడర్ కర్నాటి విద్యాసాగర్ తదితర బీసీ లీడర్లు హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ ముగ్గురు బీసీ లీడర్లు మునుగోడు టికెట్​ఆశించగా, అధిష్ఠానం ప్రభాకర్​రెడ్డికి టికెట్​కేటాయించి షాక్ ఇచ్చింది. దీంతో మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ, నారాయణ్​పూర్, చౌటుప్పల్, గట్టుప్పల్ మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లతో నేతలు భేటీ అయ్యారు. ఉప ఎన్నికలో ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తమపైన రుద్దిన హైకమాండ్, ఈ ఎన్నికల్లోనూ అదే పొరపాటు చేసిందని మండిపడ్డారు. ఉప ఎన్నికలో గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యే ప్రభాకర్​రెడ్డి.. బీఆర్ఎస్​లోకల్ లీడర్లను టార్గెట్ చేసి వేధిస్తూ, అక్రమంగా కేసులు పెట్టిస్తున్నాడని ఆరోపించారు. ఈసారి ప్రభాకర్​రెడ్డిని పక్కనపెట్టి, బీసీ లీడర్లకు అవకాశమివ్వాలని వారు డిమాండ్ చేశారు.  

చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి 

నాగార్జునసాగర్, నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల బీఆర్ఎస్ ​టికెట్లను బీసీ లీడర్లు ఆశిం చారు. నల్గొండలో పిల్లి రామరాజు యాదవ్, సాగర్​లో మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ మన మడు రంజిత్ యాదవ్, మునుగోడులో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్​రెడ్డి, విద్యాసాగర్ టికెట్ కోసం ప్రయత్నించారు. సిట్టింగులకే సీట్లు కేటాయించడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. నాలుగైదు రోజులుగా పార్టీ లీడర్లు, కుల సంఘాలతో భేటీ అవుతున్నారు. 
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి పో టీ చేయాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూతురు అనురాధను బీఆర్ఎస్ లీడర్లు సంప్రదించారు. ఆమె గ్రీన్​సిగ్నల్ ​ఇచ్చినప్పటికీ చివరి క్షణం లో సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియకే టికెట్ ఇచ్చారు. దీంతో అనురాధ ఇండిపెండెంట్​గా పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భద్రాచలం టికెట్ కోసం మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చయ్య తీవ్రంగా ప్రయత్నించారు. కానీ తెల్లం వెంకట్రావ్​కు టికెట్ ఇవ్వడంతో ఆయన నారాజ్ అయ్యారు.   

పటాన్​చెరు నియోజకవర్గం నుంచి చిట్కుల్ గ్రామ సర్పంచ్, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు నీలం మధు బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. నిజానికి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఈసారి నీలం మధుకు టికెట్​ఖాయమని భావించారు. కానీ మరోసారి గూడెం మహిపాల్​రెడ్డికి టికెట్ కేటాయించడంపై మధు వర్గీయులు మండిపడ్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీసీ నేతలంతా ఏకతాటిపైకి వస్తున్నారు. మధుపై ఒత్తిడి పెంచుతూ ఎన్నికల ఖర్చుల కోసం విరాళాలు సైతం అందజేస్తున్నారు. దీంతో బలప్రదర్శనకు దిగుతున్న మధు హైకమాండ్​కు చుక్కలు చూపిస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గానికి టికెట్​ఇవ్వడంతో పెద్ద శంకరంపేటకు చెందిన బీసీ లీడర్ విగ్రహం శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహంతో ఉన్నారు. కొద్దిరోజులుగా బలప్రదర్శనకు దిగుతున్న శ్రీనివాస్​గౌడ్​పార్టీ మారే అవకాశం ఉన్నట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు.