జనగామ కాంగ్రెస్​లో బీసీ లొల్లి.. పొన్నాలకు వ్యతిరేకంగా బీసీల మీటింగ్​

జనగామ కాంగ్రెస్​లో బీసీ లొల్లి..  పొన్నాలకు వ్యతిరేకంగా బీసీల మీటింగ్​
  • జనగామ కాంగ్రెస్​లో బీసీ లొల్లి 
  • పొన్నాలకు వ్యతిరేకంగాబీసీల మీటింగ్​
  • టికెట్ ​ఇస్తే ఓటమి తప్పదని వాదన
  • పీసీసీ నేతలను కలవాలని నిర్ణయం

జనగామ, వెలుగు : జనగామ కాంగ్రెస్​లో బీసీ లొల్లి మొదలైంది. సీనియార్టీతో పాటు బీసీ కోటాలో టికెట్​ తెచ్చుకునేందుకు మాజీ టీపీసీసీ చీఫ్​ పొన్నాల లక్ష్మయ్య  తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వచ్చే ఆయనకు టికెట్​ ఇవ్వొద్దని లోకల్​ బీసీ లీడర్లు అంటున్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గాయత్రి గార్డెన్​లో పార్టీ బీసీ లీడర్లు సమావేశమయ్యారు. ఎప్పుడూ హైదరాబాద్​, ఢిల్లీలలో ఉండే పొన్నాల ఎప్పుడో వచ్చి వెళ్తుంటారని ఆరోపించారు. 40 ఏండ్ల రాజకీయ జీవితంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు గుర్తుకు రాని బీసీలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. టికెట్ కోసం మాత్రమే ఆయన బీసీ కార్డు వాడుకుంటున్నారని ఆరోపించారు. 

వరుసగా రెండుసార్లు ఓడిపోయిన ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని,  ఈసారి టికెట్​ ఇచ్చినా  ఓటమి తప్పదని వారు అంటున్నారు.  పొన్నాలకు కాకుండా  ఎవరికి టికెట్​ ఇచ్చినా గెలిపించుకుంటామని, పార్టీ సర్వేల ఆధారంగా  టికెట్​ ఇవ్వాలని కోరారు. త్వరలోనే పీసీసీ నేతలను కలిసి పొన్నాలకు టికెట్​ ఇవ్వవద్దని చెప్తామని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు దూడల సిద్దయ్య గౌడ్​, ఉడుత రవి, నల్లగోని బాలకిషన్​, మెరుగు బాలరాజు, యాదగిరి , బనుక శివరాజ్​, భద్రప్ప, శ్రీనివాస్​, పరుశరాం తదితరులు పాల్గొన్నారు.