
- ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరగాలె
- ఆబ్కారీ అక్రమాలపై సీఎంను కలిసి ఫిర్యాదు చేస్తం
- బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్
బషీర్‌బాగ్, వెలుగు : ఆంధ్రప్రదేశ్‌లో పని చేసే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను తిరిగి సొంతరాష్ట్రానికి తీసుకురావాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు క్లియరెన్స్ ఇచ్చినా కూడా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 636 మందిని తీసుకురాకుండా నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నారు. ఏపీలో పుట్టి అక్కడే ఎక్సైజ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే వాసుదేవరావు భార్య ప్రైవేట్ ఉద్యోగి అయినా స్పౌజ్ కోటా కింద అక్రమంగా తెలంగాణకు రప్పించి జూబ్లీహిల్స్‌లో పోస్టింగ్ ఇచ్చారని ఆరోపించారు.
బషీర్‌బాగ్‌లోని ప్రెస్ క్లబ్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పదేళ్లుగా కుటుంబానికి దూరంగా ఆంధ్రలో పని చేస్తున్న రాష్ట్ర ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలని కోరారు. అదే విధంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమ ప్రమోషన్లు, బదిలీలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ శాఖలో సాధారణ బదిలీలు, ప్రమోషన్లు ఐదేళ్లుగా జరగలేదని, పైరవీల ద్వారానే చేపట్టారని ఆరోపించారు. మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమకు అనుకూలంగా ఉన్నవారికే ప్రమోషన్లు
కోరిన చోట బదిలీలు చేశారని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లోని టానిక్ లిక్కర్ మార్ట్‌కు గత ప్రభుత్వం ఎలాంటి టెండర్ లేకుండా 5 ఏళ్లకు స్పెషల్ జీవో ఇచ్చిందని, మళ్లీ అయిదేళ్లు పొడిగించిందన్నారు. ఆ షాప్‌ను ఎంపీ సంతోశ్‌రావు బినామీ అనిత్ రెడ్డి నడుపుతున్నారని ఆరోపించారు. ఆయా అంశాలపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ , ప్రిన్సిపల్ సెక్రటరీ
మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు వివరించారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు. సమావేశంలో బీసీ పొలిటికల్ జేఏసీ నేతలు సతీశ్, ప్రసాద్ పాల్గొన్నారు.