
సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీసీ రాజకీయ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. హైదరాబాద్ నాంపల్లిలోని అసెంబ్లీ ముందున్న గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద వీఆర్ఏలకు మద్దతుగా జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తామని, 55 సంవత్సరాలు దాటిన వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పిస్తామని సీఎం కేసీఆర్ 09/09/2020న అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని అన్నారు. రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు వాటిపై స్పందన లేదని జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ విమర్శించారు.
ముఖ్యమంత్రి హామీ అమలుకై వీఆర్ఏలు గత 41 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారనా ప్రభుత్వం మాత్రం ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తోందని జేఏసీ నేతలు తెలిపారు. వారిని పట్టించుకోక పోవడంపై జేఏసీ నాయకులు మండిపడ్డారు. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో వారి సమస్యలపై నిర్ణయం తీసుకోవాలని.. లేనిపక్షంలో బీసీ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్ఏలతో కలిసి అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు.