రెడ్డి జాగృతి సభ్యులారా ఖబర్దార్ : డాక్టర్ రూప్నర్ రమేశ్

రెడ్డి జాగృతి సభ్యులారా ఖబర్దార్ : డాక్టర్ రూప్నర్ రమేశ్
  •     బీసీల అభివృద్ధిని ఓర్వలేక కుట్రలు
  •     పిటిషన్ వాపస్ తీసుకోకుంటే ఆందోళన చేస్తం
  •     బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రూప్నర్ రమేశ్

ఆసిఫాబాద్, వెలుగు: బీసీలు రాజకీయంగా ఎదగద్దనే ఉద్దేశంతో బీసీ అభ్యున్నతి కోసం ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 9ను సవాల్ చేస్తూ హైకోర్టులో రెడ్డి జాగృతి సభ్యులు వేసిన పిటిషన్ వాపస్ తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం ఆసిఫాబాద్​జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రూప్నర్ రమేశ్ డిమాండ్ చేశారు. పట్టణంలో గురువారం మీడియాతో మాట్లాడారు. పిటిషన్ వాపసు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేస్తా మని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం బాధాకరమన్నారు. 

రెడ్డి జాగృతి సభ్యులు ఎన్ని కుట్రలు చేసినా ఎప్పటికైనా బీసీ రాజ్యాధికారాన్ని సాధించి తీరుతామన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో అన్ని బీసీ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టనునట్టు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘ జిల్లా రైతు అధ్యక్షులు మారుతీ పటేల్, సంఘం నాయకులు మొహర్లే తిరుపతి, బి.కమలాకర్, ఎం.హనుమంతు, సదాశివ్, మొహర్లే తదితరులు పాల్గొన్నారు.

బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోం

కుంటాల, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గురువారం కుంటాల తహసీల్దార్ కమల్ సింగ్​కు బీసీ నేతలు వినతిపత్రం అంద జేశారు. రాష్ట్ర జనాభాలో 60 శాతం ఉన్న బీసీలు రాజకీయంగా ముందుకెళ్లాలని కాంగ్రెస్​ప్రభుత్వం కులగణన చేసి న్యాయం చేసిందని, దీన్ని తప్పుబడుతూ కొందరు హై కోర్టుకు వెళ్లడం బాధాకరమని మాజీ సర్పంచ్ సమత ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కాదంటే ఎన్నికలు బహిష్కరిస్తామన్నారు. బీసీ నాయకులు ఓడ్నం అనిల్, చిప్ప నరేందర్, బోగ లక్ష్మణ్, డి.వెంక టేశ్, సాయన్న, బోనగిరి రమేశ్, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.