ఏపీలో లక్ష ఉద్యోగాలు.. ఇక్కడ లక్ష బర్రెలు, గొర్రెలు

ఏపీలో లక్ష ఉద్యోగాలు.. ఇక్కడ లక్ష బర్రెలు, గొర్రెలు
  • సీఎం కేసీఆర్​పై ఆర్.కృష్ణయ్య ఫైర్
  • 4,600 స్కూళ్లు మూసేశారని ఆవేదన
  • 40 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: పక్క రాష్ట్ర సీఎం జగన్​  అక్కడ లక్ష ఉద్యోగాలు ఇస్తుంటే, మన  సీఎం కేసీఆర్ మాత్రం లక్ష గొర్రెలు, బర్రెలు ఇస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లు పటిష్టం చేసి, విద్యా ప్రమాణాలు పెంచి, ఉపాధి అవకాశాలు కల్పించాలే కానీ.. ఇలా గొర్రెలు, బర్రెలు, చేపలు ఇవ్వడం అభివృద్ధి చెందుతున్న దేశానికి మంచిది కాదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 4,600 ప్రభుత్వ స్కూళ్లు మూసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలంటూ నిరుద్యోగ జేఏసీ.. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ కార్యాలయం ముందు శనివారం ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ… ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రైవేట్ పరం చేసేందుకే, కుట్రపూరిత బుద్ధితో టీచర్ పోస్టులను భర్తీ చెయ్యడం లేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టెట్ నిర్వహించలేదన్నారు. ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన టెట్ ను ఏడేళ్లుగా నిర్వహించకపోవడంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమవుతోందన్నారు. టెట్ నిర్వహించి, 40 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలోని నిరుద్యోగులను ఐక్యం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.