బీసీల సంక్షేమానికి రూ.2 లక్షల కోట్లు కేటాయించాలి

బీసీల సంక్షేమానికి రూ.2 లక్షల కోట్లు కేటాయించాలి

న్యూఢిల్లీ, వెలుగు: దేశంలోని బీసీల సంక్షేమానికి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు. శనివారం ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలోని బీసీ సంఘం ప్రతినిధులు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన 15 అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీ కులాల జనాభా లెక్కలు తీయాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీ రాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్ల పెంపు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, ఆంగ్లో- ఇండియన్ మాదిరిగా బీసీలను చట్ట సభలకు నామినేట్ చేయడంతో పాటు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై చర్చించారు. తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. బీసీల సమస్యలపై ప్రధాని మోడీ, ఇతర కేంద్ర మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని పేర్కొన్నారు.