ఢాకా: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను ఇండియా నుంచి తరలించడానికి ఐసీసీ అంగీకరించకపోయినా.. తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) మంగళవారం మరోసారి స్పష్టం చేసింది. భద్రతా సమస్యల వల్లే ఇండియాలో పర్యటించేందుకు తాము వెనకడుగు వేస్తున్నామని వెల్లడించింది. అయితే సాధ్యమైన పరిష్కారం కోసం మరోసారి ఐసీసీతో చర్చలు జరుపుతామని తెలిపింది.
‘టోర్నీ షెడ్యూల్, ట్రావెల్ ప్లాన్స్, విమాన టిక్కెట్లు అన్నీ రెడీ అయ్యాయని ఐసీసీ చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేదికలు మార్చడం సాధ్యం కాదని వెల్లడించింది. అయినప్పటికీ మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదని మేం కూడా స్పష్టంగా చెప్పాం. మా ప్లేయర్లు, సిబ్బందిని కాపాడుకోవడానికి ఇంతకన్నా వేరే మార్గం లేదు. ఈ అంశంలో మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని బీసీబీ పేర్కొంది.
