women's cricket: మహిళా క్రికెటర్లకు BCCI బంపర్ ఆఫర్: భారీగా మ్యాచ్ ఫీజులు పెంపు..

women's cricket: మహిళా క్రికెటర్లకు BCCI బంపర్ ఆఫర్: భారీగా మ్యాచ్ ఫీజులు పెంపు..

BCCI News: దేశీయ మహిళా క్రికెటర్ల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌లో సాధించిన అద్భుత విజయం స్ఫూర్తితో.. అపెక్స్ కౌన్సిల్ మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజుల భారీ పెంపునకు ఆమోదం తెలిపింది. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు కూడా గుర్తింపు, ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.

బీసీసీఐ తాజాగా సీనియర్ మహిళా క్రికెటర్లకు గతంలో దేశవాళీ టోర్నమెంట్లలో మ్యాచ్ లకు రోజుకు రూ. 20వేలు మాత్రమే చెల్లించేంది. కానీ ఇప్పుడది రూ.50వేలకు పెరిగింది. అంటే ఒక్కో మ్యాచ్ రోజుకు వారి ఆదాయం భారీగా పెరిగింది. అలాగే రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు గతంలో రోజుకు రూ.10వేలు అందించగా.. ఇప్పుడది రూ.25వేలకు పెంచబడింది. టీ20 ఫార్మాట్‌లో ఆడే మహిళా ప్లేయర్లకు మ్యాచ్ రోజుకు రూ.25వేలు, రిజర్వ్ ప్లేయర్లకు రూ.12వేల 500 చెల్లించనున్నారు రోజుకు. ఒక టాప్ డొమెస్టిక్ ప్లేయర్ ఏడాది పొడవునా అన్ని ఫార్మాట్లలో ఆడితే.. సుమారు రూ.12 లక్షల నుండి రూ.14 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఇదే సమయంలో జూనియర్ క్రికెటర్లకు సైతం బీసీసీఐ తీపి కబురు అందించింది. అండర్-23, అండర్-19 విభాగాల్లో ఆడే క్రీడాకారులకు రోజుకు రూ.25వేలు, రిజర్వ్ ప్లేయర్లకు రూ.12వేల 500 ఫీజుగా నిర్ణయించారు. ఇది అప్ కమింగ్ క్రీడాకారిణులకు గొప్ప ప్రోత్సాహకంగా నిలుస్తుంది. 

కేవలం ఆటగాళ్లే కాకుండా.. మ్యాచ్ నిర్వహణలో కీలక పాత్ర పోషించే అంపైర్లు, మ్యాచ్ రెఫరీల ఫీజులను కూడా భారీగా పెంచారు. లీగ్ మ్యాచ్‌లలో అధికారులకు రోజుకు రూ.40వేలు, నాకౌట్ మ్యాచ్‌లలో ప్రాధాన్యతను బట్టి రూ.50వేల నుండి రూ. 60వేల వరకు చెల్లించనుంది బీసీసీఐ. ఉదాహరణకు రంజీ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసే వారు ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు సంపాదించవచ్చు.

మొత్తంగా ఈ కొత్త పే హైక్స్ దేశవాళీ క్రికెట్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే కాకుండా.. స్పోర్ట్స్ ప్రొఫెషన్ గా ఎంచుకునే మహిళల్లో నూతనోత్సాహాన్ని నింపుతుంది. ఆర్థిక స్థిరత్వం ఇవ్వటంతో ఆటగాళ్లు మరింత ఏకాగ్రతతో రాణించే అవకాశం ఉంటుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.