
న్యూఢిల్లీ/ ఢాకా: ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌ను యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో వెలువడే చాన్స్ ఉందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వర్గాలు తెలిపాయి. టోర్నీ వేదికను ఖరారు చేసేందుకు గురువారం జరిగిన ఏసీసీ మీటింగ్‌కు 25 సభ్య దేశాలు హాజరుకాగా, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, మాజీ ట్రెజరర్ ఆశిష్ షెలార్ వర్చువల్‌గా ఇందులో పాల్గొన్నారు. ‘బీసీసీఐ.. ఆసియా కప్‌ను యూఏఈలో నిర్వహించొచ్చు.
ఇండియా, పాక్ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరిగే చాన్స్ ఉంది. షెడ్యూల్‌పై ఇంకా చర్చలు జరుగుతున్నాయి’ అని పీసీబీ, ఏసీసీ ప్రెసిడెంట్ మోసిన్ నఖ్వీ వెల్లడించాడు. సెప్టెంబర్ చివరి వారంలో వెస్టిండీస్‌తో ఇండియా టెస్ట్ సిరీస్ ఆడనున్న నేపథ్యంలో ఈ టోర్నీని రెండు వారాల్లోనే ముగించనున్నారు. టెస్ట్‌లు ఆడే ఆసియా జట్లు ఇండియా, శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో పాటు యూఏఈ, హాంకాంగ్, ఒమన్ ఇందులో పాల్గొంటాయి. సెప్టెంబర్ 10 నుంచి 28 వరకు ఈ టోర్నీ జరిగే అవకాశం ఉంది.