
హైదరాబాద్, వెలుగు: జనాభా ప్రాతిపదికన బీసీ కులాలకు చెందిన వారికి అన్ని ప్రభుత్వ శాఖల్లో, నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం ప్రాతినిధ్యం కల్పించాలని బీసీ ఇంజనీర్స్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఫెడరేషన్ అధ్యక్షుడు దేవళ్ల సమ్మయ్య, ప్రధానకార్యదర్శి సతీష్ కొట్టె ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రతినిధులు.. ప్రభుత్వ విభాగాల్లోని ప్రమోషన్లలో, కీలక పదవుల్లో బీసీ ఉద్యోగులు, బీసీ ఇంజనీర్లకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీలకు ప్రమోషన్లు, బదిలీల్లో అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఫోకల్ స్థానాల నియామకాల్లో తగిన ప్రాతినిధ్యం లభించలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో న్యాయంగా వ్యవహరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ జైపూర్ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ప్రకటించిన భరోసాను ప్రభుత్వం అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ లకు బీసీ ఇంజనీర్స్ ఫెడరేషన్ ప్రతినిధి బృందం శుభాకాంక్షలు తెలిపింది.