
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ మరోసారి బ్యాటింగ్ లో విజృంభించింది. శనివారం (మే 24) ఢిల్లీ క్యాపిటల్స్ పై చెలరేగి ఆడి భారీ స్కోర్ నమోదు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ హాఫ్ (34 బంతుల్లో 53:5 ఫోర్లు,2 సిక్సర్లు) సెంచరీతో సత్తా చాటగా.. స్టోయినిస్(16 బంతుల్లో 44:4 సిక్సర్లు, 3 ఫోర్లు) మెరుపులు మెరిపించాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ వచ్చేసింది. శ్రేయాస్ అయ్యర్ (53) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ మూడు వికెట్లు.. విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ముకేశ్ కుమార్ కు ఒక వికెట్ దక్కింది.
ALSO READ | ENG vs IND: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్: నలుగురు స్టార్స్‌కు సెలక్టర్లు షాక్.. కారణాలివే!
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ ఆరంభంలోనే ప్రియాంష్ ఆర్య (6) వికెట్ కోల్పోయింది. ఈ దశలో ప్రభ్ సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ ధాటిగా ఆడడంతో పవర్ ప్లే లో పంజాబ్ 60 పరుగులు చేసింది. స్వల్ప వ్యవధిలో ఇంగ్లిస్ (32), సిమ్రాన్ సింగ్ (28) వికెట్లు తీసి ఢిల్లీ ఆధిపత్యం చూపించింది. అయితే అయ్యర్, వధేరా నాలుగో వికెట్ కు 41 పరుగులు జోడించి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
వధేరా ఔటైనా.. అయ్యర్ పంజాబ్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. హాఫ్ సెంచరీతో జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయ్యర్ ఔటైన తర్వాత మార్కస్ స్టోయినిస్ రెచ్చిపోయి ఆడాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోర్ కార్డు ను 200కు చేర్చాడు. తొలి 10 ఓవర్లలో 97 పరుగులు చేసిన పంజాబ్.. చివరి 10 ఓవర్లలో 109 పరుగులు రాబట్టింది. స్టోయినిస్ 16 బంతుల్లోనే 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.