ఎలుగుబంటి దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు

ఎలుగుబంటి దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు

కాగజ్ నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్​జిల్లా సిర్పూర్.టి మండలంలో ఓ ఎలుగుబంటి హల్​చల్​చేసింది. లోనవెల్లి, టోంకిని గ్రామాల శివారులోని పొలానికి, వాకింగ్​కు వెళ్లిన ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. లోనవెల్లి గ్రామానికి చెందిన అవనిధర్ గౌడ్ రోజూలాగే శుక్రవారం కర్జపెల్లి వైపు వాకింగ్​కు వెళ్లాడు. అదే టైంలో అటుగా వచ్చిన ఓ ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. చుట్టుపక్కల వారు పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారీగాం వైపు పారిపోయింది. అదే ఎలుగుబంటి టోంకిని శివారులోని మక్క చేనుకు నీళ్లు పెడుతున్న చౌదరి బోను అనే రైతుపై దాడి చేసింది. చుట్టుపక్కల రైతులు గమనించి అంబులెన్స్​లో సిర్పూర్.టి హాస్పిటల్​కు తరలించారు. ఈ ఘటనలపై సిర్పూర్.టి ఎఫ్ఆర్ఓ పూర్ణచందర్ స్పందిస్తూ.. ఎలుగుబంటి పిల్లలతో ఉన్నట్లు తెలిసిందని, సంచారంపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు.