వామ్మో.. కరీంనగర్ పబ్లిక్ జర జాగ్రత్త.. సీసీ కెమెరాల్లో ఏం రికార్డయిందో చూడండి..!

వామ్మో.. కరీంనగర్ పబ్లిక్ జర జాగ్రత్త.. సీసీ కెమెరాల్లో ఏం రికార్డయిందో చూడండి..!

కొత్తపల్లి: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తిలో ఎలుగుబంటి సంచారంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఎలుగుబంటి ఇళ్ల మధ్య రోడ్లపై నడుచుకుంటూ వెళ్లడం రెండు రోజుల క్రితం సీసీ కెమెరాలో రికార్డయింది. వీధుల్లో ఎలుగుబంటి తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో చూసి ప్రజలు భయాందోళన చెందారు. గుట్టల సమీపంలోని మామిడితోటలో తిరుగుతోందని, నిత్యం కాలనీల్లో సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు. 

రేకుర్తిలో ఇలా ఎలుగుబంట్లు తిరగడం ఇది మొదటిసారి కాదు. 2022 జులైలో కూడా ఇలానే జరిగింది. రేకుర్తిలోని ఓ మార్బుల్ స్టోర్లో గుడ్డేలుగు సంచరించిన దృశ్యాలు అప్పుడు కూడా సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎలుగుబంటి సంచారం గురించి తెలియడంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. మార్బుల్ స్టోర్కు కొద్ది దూరంలోని బద్దిపల్లి ప్రాంతంలోని గ్రానైట్ క్వారీల వైపు నుంచి ఎలుగుబంటి వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

2022లో మాత్రమే కాదు.. కొన్నాళ్ల క్రితం శాతవాహన యూనివర్సిటీలో పరిసరాల్లో ఓ ఎలుగుబంటి కనిపించింది. అప్పటి నుంచి దాని ఆచూకీ కోసం ఫారెస్ట్ అధికారులు గాలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. 2022లో కనిపించిన ఎలుగుబంటి.. రెండ్రోజుల క్రితం మళ్లీ రేకుర్తిలో కనిపించిన ఎలుగు కూడా అదే అయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు ఆ ఎలుగుబంటిని ఎలాగైన పట్టుకుని అడవిలో వదిలేసి.. తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

ALSO READ : కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టుకు అఘోరి

తాజా ఘటనలో అయితే.. జులై 9వ తేదీ 9 గంటల 43 నిమిషాల సమయంలో ఎలుగుబంటి వీధుల్లోకొచ్చింది. అప్పటికే రోడ్డుపై ఎవరూ లేకపోవడం, అందరూ ఇళ్లలోనే ఉండటంతో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. అల్లంత దూరంలో బైక్ పై వెళుతున్న ఒక యువకుడు ఈ ఎలుగుబంటిని గమనించి భయంతో వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు.