
కరీంనగర్ క్రైమ్, వెలుగు: పీటీ వారెంటుపై చర్లపల్లి జైలు నుంచి ఎన్నూరి శ్రీనివాస్(అఘోరి)ని గురువారం కరీంనగర్ తీసుకొచ్చి పోలీసులు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళకు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషాన్ పల్లికు చెందిన శ్రీనివాస్(అఘోరి) తో 2024 నవంబర్‌లో ఫోన్‌లో పరిచయం ఏర్పడింది.
అదే నెలలో శ్రీనివాస్‌ను సదరు మహిళ కలవగా ఆమె పట్ల.. అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడి చేశాడు. తిరిగి రెండోసారి అతని మాటలు నమ్మి 2025 జనవరిలో కలవగా కొండగట్టు ప్రాంతానికి తీసుకొని వెళ్లి తాళి కట్టడంతోపాటు తన దగ్గర రూ.3లక్షలు తీసుకొని, లైంగికంగా దాడి చేశాడని అఘోరిపై సదరు మహిళ కొత్తపల్లి పోలీసులకు 2025 ఏప్రిల్ 28న ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు
శ్రీనివాస్ పై అత్యాచారం, కిడ్నాప్, చీటింగ్ కేసు నమోదు చేశారు. వేరే కేసులో అఘోరి శ్రీనివాస్ రిమాండ్ పై చర్లపల్లి జైల్లో ఉండగా కోర్టు జారీచేసిన పీటీ వారెంట్ ద్వారా అతన్ని జైలు నుంచి తీసుకొచ్చి కరీంనగర్ కోర్టులో హాజరు పరిచారు. శ్రీనివాస్‌కు మేజిస్ట్రేట్ ఈనెల 23 వరకు రిమాండ్ విధించారు. దాంతో తిరిగి అతన్ని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.