344 శాతం పెరిగిన నైకా లాభం

344 శాతం పెరిగిన నైకా లాభం

 

  •   రెవెన్యూ 39 శాతం అప్​
  •   క్యూ2 లాభం రూ.5.2 కోట్లు

న్యూఢిల్లీ: నైకాని నడుపుతున్న బ్యూటీ  ఫ్యాషన్ ఈ–టైలర్ ఎఫ్​ఎస్​ఎన్​ఈ–కామర్స్ వెంచర్స్​కు సెప్టెంబర్ క్వార్టర్​లో లాభం 344శాతం పెరిగి రూ. 5.2 కోట్లుగా నమోదయింది. మొత్తం ఆదాయం 39శాతం పెరిగి రూ. 1,230.8 కోట్లకు చేరుకుంది. "ఈ క్వార్టర్​లో స్థూల మార్జిన్ల పెరుగుదల వల్ల  జీఎంవీ బలంగా ఉంది. మార్కెటింగ్ ఖర్చు తగ్గడంతో ఇబిటా మార్జిన్ పెరిగింది’’ అని నైకా ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌‌లో తెలిపింది.   స్థూల సరుకుల విలువ లేదా జీఎంవీ రిపోర్టింగ్​ క్వార్టర్​లో 45శాతం (వార్షికంగా) పెరిగి రూ. 2,345.7 కోట్లకు చేరుకుంది. అయితే స్థూల మార్జిన్  45.3శాతం నుంచి 42.7శాతానికి తగ్గింది.  ఇబిటా మార్జిన్ 3.3శాతం నుంచి ఐదుశాతానికి పెరిగింది.  క్రితం ఏడాది క్యూ2లో ఇబిటా రూ. 28.8 కోట్లని నైకా తెలిపింది.  ఇదేకాలంలో  బ్యూటీ, పర్సనల్​ కేర్ విభాగం​ జీఎంవీ 39శాతం పెరిగి రూ. 1,630 కోట్లకు చేరుకుంది.  మార్జిన్లు కూడా 630 బేసిస్​ పాయింట్లు పెరిగాయి. ఫ్యాషన్ వ్యాపారం జీఎంవీ 43శాతం వృద్ధిని నమోదు చేసి రూ. 599.1 కోట్లకు చేరుకుంది. మిగిలిన విభాగాల్లో జీఎంవీ 240శాతం పెరిగి రూ.116.5 కోట్లకు చేరుకుంది.   2022 సెప్టెంబరు నాటికి తమ వద్ద 182 బ్రాండ్‌‌లు ఉన్నాయని, 650కిపైగా నగరాల్లో స్టోర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. నైకా షేరు 52 వారాల గరిష్టం ధర రూ.2,574 కాగా, ఇటీవల ఇది 52శాతం పడింది. అయితే   ఫలితాల ప్రకటన తర్వాత షేరు  2.36 శాతం లాభపడి రూ.1,180లకు చేరింది.