ఏఐ భామలకు అందాల పోటీ

ఏఐ భామలకు అందాల పోటీ
  •  వరల్డ్ టాప్ 10 ఫైనల్ లిస్టులోకి తొలి ఇండియన్ 
  • ఏఐ భామ జారా శతావరి 
  • పోటీలో ప్రపంచవ్యాప్తంగా 1,500 మంది ఏఐ మోడల్స్‌‌  

న్యూఢిల్లీ: ఇండియన్ మోడల్ జారా శతావరి.. ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొనబోతున్నది. అయితే ఎవరు ఈమె అనుకుంటున్నారా..? జారా శతావరి నిజమైన అమ్మాయి కాదు.. ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ (ఏఐ) క్రియేట్‌‌ చేసిన అందాల సుందరి! ఈ డిజిటల్‌‌ భామకు అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొనే చాన్స్ వచ్చింది. అంతేకాకుండా జారా శతావరి టాప్‌‌ 10 ఫైనలిస్టుల జాబితాలో కూడా చేరింది. 

ఈ మిస్‌‌ ఏఐ పోటీలను ఫ్యాన్‌‌వ్యూ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఇండియాకు చెందిన మొబైల్ యాడ్‌‌ ఏజెన్సీ వ్యవస్థాపకుడు రాహుల్‌‌ చౌధరి ఈ ఏఐ భామనిసృష్టించారు. ఈ ఏఐ అందాల పోటీలకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,500 మంది ఏఐ మోడల్స్‌‌, ఇన్‌‌ఫ్లుయెన్సర్లు రాగా, శతావరి టాప్‌‌ 10 ఫైనల్‌‌ లిస్ట్‌‌లో చేరింది. ఈమె ఒక వెబ్‌‌సైట్‌‌ను కూడా రన్‌‌ చేస్తోంది. 

హెల్త్‌‌, ఫ్యాషన్‌‌ ట్రెండ్స్‌‌పై అందులో పోస్టులు పెడుతూ ఉంటుంది. మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే హార్మోన్‌‌ సమస్యలు, పీసీవోఎస్‌‌, డిప్రెషన్‌‌ వంటి వాటిపై కూడా అవగాహన కల్పిస్తోంది. తన ఫాలోవర్స్‌‌తో కనెక్ట్‌‌ కావాలని, ప్రతిరోజూ వారిని ఇన్‌‌స్పైర్‌‌‌‌ చేయాలని ఆమె కోరుకుంటోంది. 

టాప్ 10లోకి ఆసియా నుంచి ఇద్దరే.. 

శతావరికి ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో 7,500 మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్‌‌ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. సంప్రదాయ, ఫ్యాషన్‌‌ దుస్తుల్లో ఫొటో షూట్‌‌లు చేస్తూ వాటిని అప్‌‌లోడ్‌‌ చేస్తుంది. హెల్త్‌‌, కెరీర్‌‌‌‌ డెవలప్‌‌మెంట్‌‌, తాజా ష్యాషన్‌‌ ట్రెండ్‌‌లపై విషయాలను పంచుకోవడం, ఉత్తమ జీవితాన్ని గడపడానికి కావాల్సిన చిట్కాలు, ఫాలోవర్స్‌‌లో స్ఫూర్తిని నింపడం తనకు ఇష్టమని శతావరి తన వెబ్‌‌సైట్‌‌లో రాసుకొచ్చింది.

 ఈ సందర్భంగా శతావరి సృష్టికర్త రాహుల్‌‌ చౌధరి మాట్లాడుతూ.. ‘‘ప్రపంచవ్యాప్తంగా 1,500 మంది ఏఐ మోడల్స్‌‌ పోటీకి వచ్చారు. అందులో జారా టాప్‌‌ 10లోకి చేరడం ఆనందంగా ఉంది. ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఫస్ట్ ఏఐ మోడల్‌‌ శతావరి. ఆసియా నుంచి లిస్ట్‌‌లో ఉన్న ఇద్దరిలో ఈమె కూడా ఒకరు. ఏఐ గురించి ప్రయోజనాలు, సవాళ్లు ఉన్నాయి. 

అయితే, మనం దానిని ఏ విధంగా ఉపయోగించుకుంటామో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఏఐ గురించి అనేక విషయాల్లో అవగాహన కల్పించడమే శతావరి లక్ష్యం. ఎనర్జీ, అందమైన చిరునవ్వుతో ఆమె తన ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది. దీంతో ఆమె చెప్పే విషయాలను ఫాలో అయ్యేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు” అని వివరించారు.