సమంత రాజీగా ఎలా మారిందో తెలుసా..

సమంత రాజీగా ఎలా మారిందో తెలుసా..
  • ఫ్యామిలీ మ్యాన్ 2‌పై సమంతా ఆసక్తికర విషయాలు

తన నటనతో తక్కువ సమయంలోనే అగ్రకథానాయికగా ఎదిగిన సమంతా.. వెబ్ సిరీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయి.. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటుంది. సమంత ఈ సిరీస్‌లో శ్రీలంక తమిళ విముక్తి పోరాట యోధురాలు రాజీ పాత్రలో నటించింది. అయితే ఈ సిరీస్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను సమంతా తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. 

సమంతా ఈ సిరీస్‌లో నటించింది అనేకంటే జీవించింది అని చెప్పొచ్చు. తన రాజీ పాత్ర కోసం ఆమె కొన్ని స్టంట్స్‌ని సొంతంగా చేసింది. అయితే స్టంట్స్ సొంతంగా చేయడానికి సాయం చేసిన తన స్టంట్ కోఆర్డినేటర్ యానిక్ బెన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ‘నేను సొంతంగా స్టంట్స్ చేయడానికి నాకు శిక్షణ ఇచ్చిన యానిక్ బెన్‌కు ప్రత్యేకమైన ధన్యవాదాలు. స్టంట్స్ చేయడానికి నా బాడీ సహకరించనప్పుడు కూడా నన్ను ప్రోత్సహించి చేయించారు. నాకు ఎత్తులంటే చాలా భయం. కానీ, ఆయన ఉన్నారనే ధైర్యంతోనే బిల్డింగ్ మీద నుంచి దూకేశాను’ అని తెలిపింది. 

ఈ సిరీస్‌లో సమంత తాను పోషించిన రాజీ పాత్ర గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘సిరీస్ చూసిన తర్వాత ప్రేక్షకులు, అభిమానుల వచ్చిన కామెంట్లు, అభిప్రాయాలు చూసి చాలా ఆనందం వేసింది. రాజీ పాత్ర చాలా ప్రత్యేకం. ఈ పాత్ర చేయడం కోసం దర్శకులు రాజ్ మరియు డీకే నన్ను సంప్రదించినప్పుడు రాజీ పాత్ర పోషించడానికి సున్నితత్వం మరియు సమతుల్యత అవసరమని నాకు తెలుసు. రాజీ కథ కల్పితమైనప్పటికీ.. అప్పటి యుద్దంలో మరణించిన వారి కుటుంబాలకు గతాన్ని గుర్తు తెస్తుంది. వారందరికీ నా నివాళులు’ అని ఆమె అన్నారు. 

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోన్న ఫ్యామిలీ మ్యాన్ 2 అందరిచేత మెచ్చుకోబడుతోంది. మనోజ్ బాజ్‌పేయి మరియు సమంతా రూత్ ప్రభు ఇద్దరూ ఈ సిరీస్‌లో చేసిన నటనకుగానూ భారీ ప్రశంసలు అందుకుంటున్నారు.