పాదయాత్రలో షర్మిలపై తేనెటీగల దాడి

పాదయాత్రలో షర్మిలపై తేనెటీగల దాడి

వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తూ.. ‘ప్రజా ప్రస్థాన యాత్ర’ మొదలుపెట్టారు. ఆ యాత్ర 34వ రోజు నల్లగొండ జిల్లా ఆలేరు నియోజ‌క‌వ‌ర్గం మోటకొండూరు మండలంలో సాగుతోంది. నియోజకవర్గంలో ప్రజలను క్షేత్రస్థాయిలో కలుస్తున్నారు. నల్గొండ జిల్లా కొండపాక గూడెం నుంచి మలివిడత పాదయాత్రను మొదలుపెట్టిన వైఎస్‌ షర్మిల.. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో యాత్రను కొనసాగిస్తున్నారు. అయితే, వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో నేడు అపశృతి తలెత్తింది. మోటకొండూరు మండలం నుంచి పాదయాత్రగా ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో దుర్గసానిపల్లి గ్రామం వద్ద చెట్టుకింద గ్రామస్తులతో షర్మిల మాట్లాడారు. అదే సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దాంతో కార్యకర్తలు పరుగులు తీశారు. కానీ, షర్మిల మాత్రం అలాగే పాదయాత్ర కొనసాగించారు. ఆమె అనుచరులు తేనేటీగలను కండువాలతో ఊపుతుండగా.. ఆమె నడక సాగించారు. షర్మిల సహాయక సిబ్బంది అప్రమత్తం కావడంతో.. తేనెటీగల దాడి నుంచి వైఎస్‌ షర్మిల బయటపడ్డారు. వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు చందేపల్లి గ్రామంతో 400 కిలో మీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలం చందేపల్లి గ్రామంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ప్రజాసమస్యలపై వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుందని షర్మిల అన్నారు.