బీర్ కంపెనీలే వేరు..రేటు రూటు ఒకటే

బీర్ కంపెనీలే వేరు..రేటు రూటు ఒకటే

మూకుమ్మడిగా ధరల పెంపు పదకొండేళ్లుగా సాగిన వ్యవహారం

న్యూఢిల్లీ:  బీర్‌‌‌‌ కంపెనీలు కార్ల్స్‌‌బర్గ్, ఎస్‌‌ఏబీ మిల్లర్, యూబీలు కలిసి ఇండియాలో పదకొండేళ్లుగా ధరల రాజ్యం ఏలుతున్నాయని గవర్నమెంట్ యాంటీ ట్రస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తేల్చింది. ఈ మూడు కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌‌లు కీలక సమాచారాన్ని ఒకరికొకరు షేర్ చేసుకుంటూ.. ధరలను మానిప్యులేట్ చేస్తున్నారని వెల్లడించింది. 2018లోనే ఈ మూడు బీర్ కంపెనీలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తనిఖీలు చేసింది. ఆ తర్వాత విచారణ ప్రారంభించింది. రూ.51,587 కోట్ల ఇండియన్ బీర్ మార్కెట్‌‌లో ఈ మూడు కంపెనీల వాటా 88 శాతంగా ఉంది. గవర్నమెంట్ యాంటీ ట్రస్ట్ ఇన్వెస్టిగేషన్‌‌ రిపోర్ట్‌‌ను పరిగణనలోకి తీసుకుని ఈ మూడు కంపెనీలపై జరిమానా విధించనున్నామని సీనియర్ సీసీఐ సభ్యులు చెబుతున్నారు. జరిమానా రూ.1,842 కోట్లను దాటవచ్చని సంబంధిత వర్గాలంటున్నాయి. ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణలో కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌‌ల సంభాషణలు, వాట్సాప్ మెసేజ్‌‌లు, ఈమెయిల్స్ వెలుగులోకి వచ్చాయి. ఈ మెసేజ్‌‌లు, సంభాషణల్లో పలు రాష్ట్రాల్లో ధరలు పెరిగేలా వీరు కుట్రలకు పాల్పడినట్టు వెల్లడైంది.

ఈ మూడు కంపెనీలు ఉమ్మడిగా ధరలు పెరిగేలా చేయడానికి ‘ఆల్ ఇండియా బ్రూవర్స్ అసోసియేషన్‌‌(ఏఐబీఏ)’ను కామన్ ప్లాట్‌‌ఫామ్‌‌గా వాడుకున్నట్టు కూడా సీసీఐ రిపోర్ట్ గుర్తించింది. ధరల పెంపు గురించి కంపెనీల తరఫున ఇది లాబీయింగ్ చేసినట్టు పేర్కొంది. ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతూ దొరక్కుండా ఉండాలని ఈ మూడు కంపెనీలకు ఏఐబీఏ హెచ్చరికలు కూడా చేసింది. ‘దొరక్కుండా మనం తప్పించుకోవాలి’ అని మూడు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌‌లకు 2016లో ఏఐబీఏ డైరెక్టర్ జనరల్ ఈమెయిల్ పంపారు. అంతేకాక ప్రభుత్వ మెషినరీని కూడా ఈ బీర్ కంపెనీలు మానిప్యులేట్ చేశాయి. ఏఐబీఏ ద్వారా ఈ మూడు కంపెనీలు కాంపిటీషన్ చట్టాన్ని ఉల్లంఘించినట్టు సీసీఐ తన 248 పేజీల రిపోర్ట్‌‌లో పేర్కొంది. బయటికి వచ్చిన ఈ రిపోర్ట్‌‌పై సీసీఐ ఇంకా స్పందించలేదు. లాబీ గ్రూప్ ఏఐబీఏ, కార్ల్స్‌‌బర్గ్ స్పందించేందుకు నిరాకరించాయి. సీసీఐ ప్రొసీడింగ్స్ ఇంకా జరుగుతున్నాయని తేలింది. తాము అథారిటీలకు కోఆపరేట్ చేస్తున్నామని నెదర్లాండ్స్ కంపెనీ హీనెకెన్‌‌కు చెందిన యునిటెడ్ బ్రేవరీస్  తెలిపింది. సీసీఐకు అవసరమైన అన్ని రకాల డాక్యుమెంట్లు ఇస్తున్నట్టు పేర్కొంది. హీనెకెన్ మాత్రం ఈ రిపోర్ట్‌‌పై స్పందించలేదు. ఎస్‌‌ఏబీమిల్లర్‌‌‌‌ ఓనర్ మాత్రం దీనిపై సీరియస్ అయింది.

రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరు ఆల్కహాలే..

ఇండియాలో ఆల్కహాల్ మార్కెట్‌‌లో చాలా రూల్స్ ఉంటాయి. రాష్ట్రాలు సెపరేట్‌‌గా పన్నులు వేస్తాయి. ధరల్లో మార్పులు ఉంటాయి. వీటిని ప్రతేడాది లోకల్ అథారిటీలు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇండియాలో ఆల్కహాల్ మీద వచ్చే పన్నుల రెవెన్యూనే రాష్ట్రాల ప్రధాన ఆదాయంగా ఉంది. కృత్రిమంగా కొరత సృష్టించేందుకు, పాలసీల్లో రాష్ట్ర ప్రభుత్వాలు మార్పులు చేసేందుకు 2015 నుంచి 2018 మధ్య మూడు సార్లు కంపెనీలు మాట్లాడుకున్నట్టు రిపోర్ట్ తెలిపింది. ఇలాంటి అగ్రిమెంట్ యాంటీ కాంపిటేటివ్ అని యాంటీట్రస్ట్ లా పేర్కొంటోంది. ఒడిశాలో ధరలు పెంచేందుకు మూడు కంపెనీలు కలిసి బీర్ సప్లయిని తగ్గించాయని సీసీఐ పేర్కొంది.

19 మంది ఎగ్జిక్యూటివ్‌‌లకు పాత్ర..

2018లో బీర్ కంపెనీలపై రైడ్ చేసిన సీసీఐ స్మార్ట్‌‌ఫోన్లు, పెన్‌‌డ్రైవ్‌‌లు, ల్యాప్‌‌టాప్‌‌లలో ఉన్న 2 టెరాబైట్స్‌‌కు పైగా డేటాను, వేల కొద్దీ ఫైల్స్‌‌ను సీజ్ చేసింది.  ఒకవేళ కంపెనీలు సీసీఐ విచారణకు సహకరిస్తే.. పెనాల్టీలు తగ్గే అవకాశం ఉంది. ఈ కేసులో మొత్తం 19 మంది   ఎగ్జిక్యూటివ్‌‌లు భాగమయ్యారు. యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్‌‌తో వీరికి సంబంధం ఉన్నట్టు సీసీఐ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తేల్చింది. మోసానికి పాల్పడిన వారిలో మేనేజింగ్ డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లు, సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్స్ ఉన్నారు. కంపెనీల ఎగ్జిక్యూటివ్‌‌ల మధ్య కొన్ని సంభాషణలు వాట్సాప్‌‌లో కూడా సాగినట్టు రిపోర్ట్ తెలిపింది. 2013లో యూబీ చీఫ్ సేల్స్ ఆఫీసరు కిరణ్ కుమార్, ఎస్‌‌ఏబీమిల్లర్ మేనేజింగ్ డైరెక్టర్ శలభ్ సేథ్‌‌లు ఒక రాష్ట్రంలో ఒక బీర్ ధర రూ.60గా నిర్ణయించాలని వాట్సాప్ ద్వారా మెసేజ్‌‌లు పంపుకున్నట్టు రిపోర్ట్ తెలిపింది. అంతేకాక ఈ మెసేజ్‌‌ను ఇతర ఫ్రెండ్స్‌‌కి కూడా పంపించాలని సేథ్ కోరినట్టు పేర్కొంది. ఇతర కాంపిటీటర్ కంపెనీలు కూడా దీనికి ఒప్పుకున్నట్టు వెల్లడైంది. ప్రస్తుతం యూబీలో పనిచేస్తోన్న సేథ్, కుమార్ ఇద్దరూ కూడా అథారిటీలకు సహకరిస్తున్నట్టు పేర్కొన్నారు.