నిర్మల్ జిల్లాలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీల నిరవధిక బంద్

నిర్మల్ జిల్లాలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీల నిరవధిక బంద్
  • ఫీజ్ రీయింబర్స్​మెంట్ వెంటనే  రిలీజ్ చేయాలని డిమాండ్.

నిర్మల్, వెలుగు: పెండింగ్​లో ఉన్న ఫీజ్ రీయింబర్స్​మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ ​జిల్లాలోని 23 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు నిరవధిక బంద్​లో పాల్గొన్నాయి. కాలేజీలను యాజమాన్యాలు మూసివేసి నిరసన తెలిపాయి. కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రతినిధులు అఖిలేశ్ కుమార్ సింగ్, వెంకట్ రెడ్డి, నరేశ్ గౌడ్, వెంకటేశ్వర్ గౌడ్ తదితరులు పట్టణంలోని ప్రెస్ క్లబ్​లో మీడియా సమావేశంలో మాట్లాడారు. గత నాలుగేండ్లుగా డిగ్రీ కాలేజీల ఫీజు రీయింబర్స్​మెంట్​విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

జిల్లాలోని ప్రతి ప్రైవేట్ డిగ్రీ కాలేజీకి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయన్నారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకుండా.. కేవలం రీయింబర్స్​మెంట్ నిధులతో సాగే కాలేజీలను నిధులు లేకుండా నడపడం సాధ్యం కావడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీసం విడతల వారీగానైనా రీయింబర్స్​మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు.