- ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: డీసీపీ
 
మంచిర్యాల, వెలుగు: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రహదారి భద్రత మనందరి బాధ్యత అని మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్అన్నారు. హాజీపూర్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం ముల్కల్లలో గ్రామ రహదారి భద్రతా కమిటీని ఏర్పాటు చేసి, అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు భద్రత నియమాలను పాటల ద్వారా తెలుపుతూ ప్రజల్లో చైతన్యం నింపేలా పోలీస్ కళాబృందం కళాజాత ప్రదర్శన నిర్వహించారు.
హాజరైన డీసీపీ మాట్లాడుతూ.. రోడ్డుపైకి వచ్చినవారు సురక్షితంగా వారి గమ్యం చేరుకోవాలంటే రహదారి భద్రతా నియమాలు పాటించాలన్నారు. ముల్కల్లలో గత మూడు సంవత్సరాల్లో జరిగిన యాక్సిడెంట్ల తీవ్రత, కారణాలను ప్రజలకు వివరించారు. ఈ ఏడాదే గ్రామానికి చెందిన ఐదుగురు యాక్సిడెంట్లలో చనిపోయారని తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్లు మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేయడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
రోడ్లపై పశువులను వదిలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు 18 ఏండ్లలోపు పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. బైకర్స్తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ ఆర్.ప్రకాశ్, ఎంవీఐ చాడ రంజిత్, మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, తహసీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్పాండే, ఎంపీడీవో సాయి వెంకట్రెడ్డి, ఎస్సై స్వరూప్రాజ్పాల్గొన్నారు.
