న్యూఢిల్లీ: సాఫ్ట్‌బ్యాంక్ మద్దతు ఉన్న ఈ-–కామర్స్ సంస్థ మీషో, టెమాసెక్ పెట్టుబడులు ఉన్న లాజిస్టిక్స్ కంపెనీ షిప్ రాకెట్‌తో పాటు మరో ఐదు సంస్థలు ఐపీఓ ద్వారా నిధులు సమీకరించడానికి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదం లభించింది. ఈ ఏడు కంపెనీలు కలిసి దాదాపు రూ. 7,700 కోట్ల నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ఏడాది మే నుంచి జులై మధ్య కాలంలో ఈ ఏడు సంస్థలు సెబీకి తమ డాక్యుమెంట్లను సమర్పించాయి. అక్టోబర్ 14 నుంచి 31 మధ్య సెబీ పరిశీలన పూర్తయింది. రెగ్యులేటరీ పరంగా సెబీ పరిశీలన లభించడమంటే పబ్లిక్ ఇష్యూ ప్రారంభించడానికి అనుమతి లభించినట్లే!
ఈ ఏడాది ఇప్పటికే 86 కంపెనీలు ఐపీఓలకు వచ్చాయి. మీషో ఐపీఓలో రూ. 4,250 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ ఉంటుంది. వీటితో పాటు ప్రస్తుతం ఉన్న కొంతమంది వాటాదారులు 17.57 కోట్ల ఈక్విటీ షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయిస్తారు. మీషో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని క్లౌడ్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెట్టడానికి ఈ డబ్బు వాడుతారు. మార్కెటింగ్, బ్రాండ్ కార్యక్రమాల కోసం ఖర్చు, కొనుగోళ్లు, ఇతర వ్యూహాత్మక కార్యక్రమాల ద్వారా వృద్ధికి నిధులు సమకూర్చడం, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం ఈ నిధులను ఉపయోగించాలని మీషో యోచిస్తోంది.
షిప్ రాకెట్, ఇతర కంపెనీలు
షిప్‌రాకెట్ పబ్లిక్ ఇష్యూ ద్వారా సుమారు రూ. 2,500 కోట్ల వరకు సమీకరించాలని భావిస్తోంది. గుజరాత్ ఆధారిత జర్మన్ గ్రీన్ స్టీల్ అండ్ పవర్ ఐపీఓ ద్వారా రూ. 450 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ప్రమోటర్లు 20 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయిస్తారు. ఈ నిధులను గుజరాత్‌లోని తమ తయారీ సదుపాయాల విస్తరణకు, హైబ్రిడ్, విండ్, సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు, అప్పుల చెల్లింపుకు ఉపయోగిస్తారు. స్మార్ట్ ఎనర్జీ మీటర్ తయారీ సంస్థ అల్లాయిడ్ ఇంజనీరింగ్ వర్క్స్ రూ. 400 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రమోటర్ 75 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయిస్తారు. ఈ తాజా ఇష్యూ ద్వారా వచ్చే నిధులను తయారీ సదుపాయాల ఏర్పాటుకు, భవిష్యత్ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు ఉపయోగిస్తారు.
స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ ఐపీఓలో 32.92 మిలియన్ల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ ఉంటుంది. ప్రమోటర్లు, ఇతర విక్రేతలు 13.33 మిలియన్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో అమ్ముతారు. అప్పుల చెల్లింపు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఈ నిధులను కేటాయించనున్నారు.
రాజ్‌పుతానా స్టెయిన్‌లెస్ ఐపీఓలో 1.46 కోట్ల ఈక్విటీ షేర్ల వరకు తాజా ఇష్యూ, 62.5 లక్షల షేర్ల ఓఎఫ్ఎస్ ఉంటాయి. ఈ తాజా మూలధనాన్ని మూలధన వ్యయం, రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తారు. ముంబై ఆధారిత మానికా ప్లాస్టెక్ ఐపీఓ రూ. 115 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ 1.50 కోట్ల షేర్ల ఓఎఫ్ఎస్ కలయిక. ప్లాంట్, యంత్రాల కొనుగోలుకు మూలధన వ్యయం, అప్పుల చెల్లింపు కోసం ఈ నిధులు కేటాయిస్తామని పేర్కొంది.
