
యాదగిరిగుట్ట, వెలుగు: సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో నిరుద్యోగులను నిండా ముంచారని - టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య ఆరోపించారు. తుర్కపల్లి మండలం వెంకటాపురం, దత్తాయపల్లికి చెందిన 150 మంది బీఆర్ఎస్, బీజేపీ నాయకులు శుక్రవారం ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్‌లైన్‌తో ఏర్పడ్డ తెలంగాణలో ఒక్కటి కూడా సాకారం కాలేదన్నారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్ తన కుటుంబంలో మాత్రం అందరికీ పదవులు కట్టబెట్టుకున్నారని విమర్శించారు. దళిత సీఎంతో పాటు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు గృహలక్ష్మి పేరుతో రూ.3 లక్షలు ఇస్తామని చెబుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీములతో కేసీఆర్ కు భయం పట్టుకుందని విమర్శించారు. కాంగ్రెస్‌ను అడ్డుకోవాలని కుట్రలో భాగంగా బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నారని ఆరోపించారు.