హైదరాబాద్, వెలుగు: 22ఏపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన వివరణ ఇచ్చినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విప్ బీర్ల అయిలయ్య తీవ్రంగా మండిపడ్డారు. 22ఏ జాబితాలో ఉన్న ప్రైవేట్ ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతోందని తెలిపారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
కేవలం మీడియాలో ప్రచారం పొందడానికే మహేశ్వర్ రెడ్డి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ప్రతి నెలా రూ.200 కోట్ల ముడుపులు పంపుతున్నారంటూ మహేశ్వర్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ప్రతి నెలా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎన్ని వేల కోట్ల ముడుపులు వెళ్తున్నాయో మహేశ్వర్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
