లడఖ్‌లో ఇండియా తగిన సమాధానం ఇచ్చింది: ప్రధాని మోడీ

లడఖ్‌లో ఇండియా తగిన సమాధానం ఇచ్చింది: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రపంచానికి ఇండియా తన సోదరభావాన్ని చూపించిందని మన్‌ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇప్పుడు దేశంలో అన్‌లాక్ ఫేజ్ నడుస్తోందని ఈ టైమ్‌లో రెండు విషయాలు చాలా ముఖ్యమని చెప్పారు. ఒకవైపు కరోనాను సమర్థంగా ఎదుర్కొంటూనే.. మరోవైపు ఎకానమీకి బలం చేకూర్చాలన్నారు. దేశ సార్వభౌమత్వంతోపాటు సరిహద్దులను కాపాడుకోవడంలో ఇండియా తన బలం, నిబద్ధతలను చాటి చెప్పిందని మోడీ పేర్కొన్నారు.

‘లడఖ్‌లో మన భూభాగాలను కోరుకున్న వారికి తగిన సమాధానం ఇచ్చాం. ఇండియాకు మిత్రుత్వాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసు. అదే సమయంలో ప్రత్యర్థిని ఓ కంట కనిబెడుతూ ప్రతీకారం తీర్చుకొని తగిన రీతిలో బదులివ్వడమూ తెలుసు. ధైర్య సాహసాలు కలిగిన మన సైనికులు భరత మాత ఆత్మగౌరవానికి ఎటువంటి హానీ కలగనివ్వబోమని నిరూపించారు’ అని మోడీ చెప్పారు.

పీవీని యాది చేసుకున్న మోడీ

దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సేవలను మన్‌ కీ బాత్‌లో మోడీ గుర్తు చేసుకున్నారు. పీవీ ఇష్టాఇష్టాలతోపాటు ఆయన ఆలోచనా విధానం గురించి మోడీ పలు విషయాలు పంచుకున్నారు. దేశంలో అత్యంత సీనియర్ లీడర్స్‌లో పీవీ ఒకరని.. ఆయనకు హిస్టరీ, లిటరేచర్, సైన్స్‌పై చాలా ఆసక్తి ఉండేదని మోడీ చెప్పారు. దేశ నీతితో కనెక్ట్ అయిన పీవీ.. పాశ్యాత్య ఆలోచనా విధానంలోనూ మంచి ప్రావీణ్యం కలవారని మోడీ మెచ్చుకున్నారు.