69 మందికి బీఫామ్స్​ ఒకేరోజు విడతల వారీగా అందజేసిన కేసీఆర్​

69 మందికి బీఫామ్స్​ ఒకేరోజు విడతల వారీగా అందజేసిన కేసీఆర్​
  • అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థులకు సూచన

హైదరాబాద్, వెలుగు: బీఆర్​ఎస్​ అభ్యర్థుల్లో 69 మందికి ఆదివారం రాత్రి వరకు విడతలవారీగా పార్టీ చీఫ్​ కేసీఆర్​ బీఫామ్స్​ అందజేశారు. ఆదివారం ఉదయం ప్రగతి భవన్​లో కేటీఆర్ (సిరిసిల్ల), హరీశ్​రావు (సిద్దిపేట), జీవన్​రెడ్డి (ఆర్మూరు), బాల్క సుమన్​(చెన్నూరు), పల్లా రాజేశ్వర్​రెడ్డి( జనగామ)కి కేసీఆర్​ బీఫామ్స్​ ఇచ్చారు. అనంతరం ప్రగతి భవన్​నుంచి బయల్దేరి తెలంగాణ భవన్​కు చేరుకున్నారు. 

తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి..  ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ ఎలక్షన్​ ఇన్​చార్జీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 46  మందికి బీఫామ్స్​ అందజేశారు. సాయంత్రం హుస్నాబాద్​ సభలో ఒడితెల సతీశ్​కు కూడా బీఫామ్​ఇచ్చారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్​కు తిరిగి వచ్చాక ప్రగతిభవన్​లో మరో 17 మందికి బీఫామ్స్​ అందజేశారు. బీఫామ్స్​తోపాటు  ఎన్నికల్లో ఖర్చు కోసం  రూ.40 లక్షల చొప్పున చెక్కులు ఇచ్చారు.

కొన్ని సీట్లు మార్చే చాన్స్​

ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లాలో 14 స్థానాలుండగా 13 మందికి బీఫామ్​లు ఇచ్చారు. ఆలంపూర్​అభ్యర్థిని మార్చాలనే డిమాండ్​నేపథ్యంలో అక్కడి నుంచి అభ్యర్థిగా ప్రకటించిన అబ్రహంకు బీఫామ్​ ఇవ్వలేదు. ఉమ్మడి మెదక్​జిల్లాలో కేసీఆర్ (గజ్వేల్​)​తో పాటు మాణిక్​రావు (జహీరాబాద్), చింత ప్రభాకర్​(సంగారెడ్డి)కి బీఫామ్​లు ఇవ్వలేదు. నర్సాపూర్​సైతం పెండింగ్​లో పెట్టారు. ఇక్కడ ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. 

కామారెడ్డికి సంబంధించిన కేసీఆర్​ బీఫామ్​ను అక్కడి ఎమ్మెల్యే గంప గోవర్దన్​ తీసుకున్నారు. తల్లి మరణంతో హైదరాబాద్​లో సమావేశానికి హాజరుకాని మంత్రి ప్రశాంత్​రెడ్డి (బాల్కొండ)కి సంబంధించిన బీఫామ్​ను ​ఎమ్మెల్సీ కవిత అందుకున్నారు. ఉమ్మడి కరీంనగర్​జిల్లా నుంచి కేటీఆర్​ ఒక్కరికే హైదరాబాద్​లో బీఫామ్​ ఇవ్వగా, హుస్నాబాద్​ప్రచార సభలో వొడితెల సతీశ్​కు కేసీఆర్​బీఫామ్​ అందజేశారు. 

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం​జిల్లాల నుంచి మొత్తం అభ్యర్థులకు బీఫామ్​లు అందజేశారు. హైదరాబాద్​తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో అభ్యర్థులందరికీ  బీఫామ్​లు ఇవ్వాల్సి ఉంది. వీటిలో కొన్ని సీట్లలో అభ్యర్థులను మార్చుతారని ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఆదివారం రాత్రి వరకు  69 నియోజకవర్గాలకు సంబంధించిన  బీఫామ్స్​ అందజేశారు. ఇంకా 50 స్థానాలకు బీఫామ్స్​ ఇవ్వాల్సి ఉంది. 

ఉదయం, మధ్యాహ్నం బీఫామ్​లు అందుకున్నవాళ్లు..

కోనేరు కోనప్ప (సిర్పూరు), దుర్గం చిన్నయ్య (బెల్లంపల్లి), దివాకర్ రావు (మంచిర్యాల), కోవ లక్ష్మీ (ఆసిఫాబాద్), భూక్య జాన్సన్ నాయక్ (ఖానాపూర్), జోగు రామన్న (ఆదిలాబాద్), అనిల్ జాదవ్ (బోథ్), ఇంద్రకరణ్ రెడ్డి (నిర్మల్), విఠల్ రెడ్డి (ముథోల్), బాల్క సుమన్ (చెన్నూరు), కేసీఆర్ (కామారెడ్డి), షకీల్  (బోధన్), హన్మంత్ షిండే (జుక్కల్), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), జాజల సురేందర్ (ఎల్లారెడ్డి), బి.గణేష్ గుప్తా (నిజామాబాద్​అర్బన్), బాజిరెడ్డి గోవర్ధన్ (నిజామాబాద్​రూరల్).

 ప్రశాంత్ రెడ్డి (బాల్కొండ), జీవన్​రెడ్డి (ఆర్మూరు), పట్నం నరేందర్ రెడ్డి (కొడంగల్), రాజేందర్ రెడ్డి (నారాయణపేట్), డాక్టర్ సి. లక్ష్మారెడ్డి(జడ్చర్ల), వెంకటేశ్వర్ రెడ్డి (దేవరకద్ర), శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్​నగర్), రాంమోహన్ రెడ్డి (మక్తల్), నిరంజన్ రెడ్డి (వనపర్తి), కృష్ణామోహన్ రెడ్డి (గద్వాల), మర్రి జనార్దన్ రెడ్డి (నాగర్​కర్నూల్), గువ్వల బాలరాజు (అచ్చంపేట),  జైపాల్ యాదవ్ (కల్వకుర్తి), అంజయ్య యాదవ్ (షాద్​నగర్), హర్షవర్ధన్ రెడ్డి (కొల్లాపూర్).

హరీశ్​రావు (సిద్దిపేట), పద్మా దేవేందర్ రెడ్డి (మెదక్), భూపాల్ రెడ్డి (నారాయణఖేడ్), చంటి క్రాంతి కిరణ్ (ఆంథోల్​), మహిపాల్ రెడ్డి (పటాన్​చెరు), ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక), రేగా కాంతారావు (పినపాక), హరిప్రియ నాయక్ (ఇల్లెందు), పువ్వాడ అజయ్ కుమార్ (ఖమ్మం), ఉపేందర్ రెడ్డి (పాలేరు), కమల్ రాజ్ (మధిర), బానోత్ మదన్ లాల్ (వైరా), వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం), సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి), మెచ్చా నాగేశ్వరరావు (అశ్వారావుపేట), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), పైళ్ల శేఖర్ రెడ్డి (భువనగిరి), కేటీఆర్​ (సిరిసిల్ల), పల్లా రాజేశ్వర్ రెడ్డి (జనగామ), ఒడితెల సతీశ్​కుమార్​(హుస్నాబాద్).

సాయంత్రం బీఫామ్స్​ అందుకున్నవాళ్లు..

జగదీశ్​రెడ్డి (సూర్యాపేట), నోముల భగత్​(నాగార్జునసాగర్), కంచర్ల భూపాల్​రెడ్డి (నల్గొండ), బొల్లం మల్లయ్య యాదవ్​(కోదాడ), రవీంద్రకుమార్​(దేవరకొండ), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి (మునుగోడు), గాదరి కిశోర్​(తుంగతుర్తి), దాసరి మనోహర్​రెడ్డి (పెద్దపల్లి), రసమయి బాలకిషన్​(మానకొండూరు), పాడి కౌశిక్​రెడ్డి (హుజూరాబాద్), దాస్యం వినయభాస్కర్ (వరంగల్​పశ్చిమ), నన్నపనేని నరేందర్ (వరంగల్​తూర్పు), పెద్ది సుదర్శన్ రెడ్డి (నర్సంపేట), బడే నాగజ్యోతి (ములుగు), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), పైలెట్​రోహిత్​రెడ్డి (తాండూరు). 

మీ గురించి కష్టపడుతున్న.. అప్రమత్తంగా ఉండాలి: కేసీఆర్

‘‘మీ గురించి నేను ఇంత కష్టపడుతున్న.. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చిన.. లీగల్​ఇష్యూస్, కోర్టు కేసులతోనే వేములవాడలో అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది.. కొన్ని చోట్ల పరిస్థితిని బట్టే క్యాండిడేట్లను మార్చినం.. ఎన్నికల సమయంలో కోపతాపాలు ఉంటయ్​.. అభ్యర్థులే ఓపిక పట్టాలి.. ఎన్నికలను సీరియస్​గా తీసుకోవాలి” అని తెలంగాణ భవన్​లో అభ్యర్థులతో సమావేశం సందర్భంగా కేసీఆర్​సూచించారు.  ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ విజయం సాధించాలన్నారు. 

‘‘మళ్లీ మనమే గెలువబోతున్నం.. నిత్యం ప్రజలతోనే ఉండండి.. ప్రతి ఒక్కరికి ప్రాధాన్యం  ఇస్తూ పనిచేసుకోండి” అని చెప్పారు.  ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న అధికారులతో ముఖ్యంగా ఎలక్షన్​ఎక్స్​పెండిచర్​అబ్జర్వర్లతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఘర్షణ పడొద్దని అన్నారు. ఎన్నికల నామినేషన్​ వేసిన రోజు నుంచే అభ్యర్థి ఖర్చు లెక్కింపు మొదలవుతుందని, ఈ నేపథ్యంలో సింపుల్​గా నామినేషన్​ వేసి ఎన్నికల ప్రచారం చేసుకోవాలని సూచించారు.

 నామినేషన్​పత్రాలు, బీ ఫాంలు నింపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ‘‘అంతా మాకే తెలుసు” అన్న ధోరణి వీడాలని చెప్పారు. ‘‘శ్రీనివాస్​గౌడ్, కృష్ణమోహన్​రెడ్డి లాంటి వాళ్లు తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారని కేసులు ఎదుర్కొన్నారు. వనమా వెంకటేశ్వర్​రావుకు ఇలాంటి సమస్యే ఎదురైంది.. ఈ నేపథ్యంలో అఫిడవిట్లు రూపొందించడం, నామినేషన్​పత్రాలు నింపడంలో పార్టీ లీగల్​టీమ్​ సహాయ సహకారాలు తీసుకోవాలి. 

అభ్యర్థుల ఆస్తుల ప్రకటనలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సోమ భరత్​అందరికీ అందుబాటులో ఉంటరు. ఆయనకు ఫోన్​చేసి సందేహాలుంటే క్లియర్​ చేసుకోవాలి” అని అభ్యర్థులకు సూచించారు. అభ్యర్థులపై ఎన్ని కేసులు ఉన్నాయో వాటి వివరాలన్నీ అఫిడవిట్లలో వెల్లడించాలన్నారు. విభేదాలు వీడి ప్రతి ఒక్కరినీ కలుపుకొని ప్రచారం చేసుకోవాలని ఆయన సూచించారు. 

పెండింగ్​ స్థానాలకు తేలని అభ్యర్థులు

అన్ని పార్టీల కంటే ముందు ఆగస్టు 21న 115 నియోజకవర్గాలకు బీఆర్​ఎస్​ అభ్యర్థులను కేసీఆర్​ప్రకటించారు. ఇందులో గజ్వేల్​, కామారెడ్డి నుంచి తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. జనగామ, నర్సాపూర్​, గోషామహల్​, నాంపల్లి స్థానాలను అప్పట్లో పెండింగ్​లో పెట్టారు. మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును అభ్యర్థిగా ప్రకటించినా.. ఆయన కాంగ్రెస్​లోకి వెళ్లారు. 

దీంతో మల్కాజిగిరి నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి, నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డికి టికెట్​ దక్కుతుందనే ప్రచారం జరుగుతున్నది. కానీ, వాళ్లకు ఆదివారం కేసీఆర్​ బీఫామ్​ ఇవ్వలేదు. గోషామహల్, నాంపల్లి అభ్యర్థులెవరో ఇంకా తేల్చలేదు. జనగామ నుంచి మాత్రం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డికి ఆదివారం బీఫామ్​ ఇచ్చారు.