బిచ్చగాడు మృతి.. అతని పెట్టెనిండా డబ్బులే

బిచ్చగాడు మృతి.. అతని పెట్టెనిండా డబ్బులే
  • తిరుమలలో బిచ్చమెత్తుకుని జీవిస్తున్న శ్రీనివాసాచారి

అనారోగ్యంతో బిచ్చగాడు మృతి చెందాడు. నా అన్న వాళ్లెవరూ లేని అనాథ. అతని గది తెరచి చూస్తే రెండు ట్రంకు పెట్టెలు, మూట కట్టిన బస్తా కనిపించాయి. వాటిని తెరచి చూస్తే పెట్టెల నిండా నోట్లు, చిల్లర నాణేలే కనిపించాయి. తిరుమలలో జరిగిందీ ఘటన. అన్ని గదులను తనిఖీ చేస్తున్న తిరుమల విజిలెన్స్ అధికారులు నిర్వాసితుడైన బిచ్చగాడి ఇంటిని తనిఖీ చేయగా రెండు ట్రంకుపెట్టెలు, మూట కట్టిన బస్తా కనిపించడంతో అనుమానంతో తెరచి చూసి ఆశ్చర్యపోయారు. పెట్టెల నిండా అంతా డబ్బులే. నోట్లు, చిల్లర నాణేలు భారీగా బయటపడ్డాయి. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వారి సమక్షంలో డబ్బులు లెక్కించారు. 
తిరుమలలో బిచ్చమెత్తుకుని జీవిస్తున్న శ్రీనివాసాచారి నిర్వాసితుడని గుర్తించి తిరుమల శేషాచల కాలనీలో రూమ్ నెంబర్ 75ను  దేవస్థానం అతనికి కేటాయించింది. దేవస్థానం ఇచ్చిన గదినే నివాసంగా ఉపయోగించుకుంటున్న శ్రీనివాసాచారి తిరుమలలో అప్పుడప్పుడు చిరు వ్యాపారాలు చేసుకుంటూ.. బిచ్చమెత్తుకుంటూ జీవించాడు. గత ఏడాది ఆరోగ్య సమస్యల వల్ల మరణించిన శ్రీనివాసాచారికి  వారసులెవ్వరు లేకపోవడంతో తిరుమల దేవస్థానం అతను నివసించిన ఇంటిని సీజ్ చేసి పెట్టింది. ఇవాళ తనిఖీలు చేస్తుండగా రెండు ట్రంకు పెట్టెలు, మూట కట్టిన గోనె సంచి కనిపించాయి. వాటిని తెరిచి షాక్ కు గురైన టీటీడీ విజిలెన్స్ వారు ట్రంకు పెట్టెల నిండా డబ్బులు ఉండటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. విజిలెన్స్ సమక్షంలో రెండు గంటలు కష్టపడి డబ్బులన్నీ లెక్కించగా 10 లక్షల వరకు ఉన్నట్లు తేలింది. ఇందులో గతంలో రద్దు చేసిన పాత వెయ్యి రూపాయల నోట్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ డబ్బును విజిలెన్స్ అధికారులు సీజ్ చేసి ట్రెజరీకి తరలించారు.