కెనడాపై బెల్జియం ఆధిపత్యం..1–0తో విజయం

కెనడాపై బెల్జియం ఆధిపత్యం..1–0తో విజయం

ఫిఫా వరల్డ్ కప్ 2022లో బెల్జియం అద్భుత విజయం సాధించింది. కెనడాతో జరిగిన మ్యాచ్‌లో 1–0 గోల్స్ తేడాతో గెలుపొందింది. హోరా హోరీగా సాగిన మ్యాచ్లో  కెనడా స్టార్టింగ్ నుంచే జోరు మీదుంది. అనేక సార్లు గోల్ చేసే అవకాశం లభించినా..గోల్ మాత్రం కొట్టలేకపోయింది. బెల్జియంకు  దక్కిన ఏకైక అవకాశాన్ని  ఆ జట్టు ప్లేయర్ మిచీ బాట్సుషాయి  సద్వినియోగం చేసుకుని గోల్‌ సాధించాడు. 

హోరా హోరీగా ఫస్టాఫ్..
కెనడా, బెల్జియం మధ్య జరిగిన ఈ మ్యాచ్ హోరా హోరీగా సాగింది. ఆట ప్రారంభమైనప్పటి నుంచే రెండు జట్ల ఆటగాళ్లు గోల్ సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. బెల్జియం ఆటగాడు యానిక్ కారస్కో.. బాక్సులో చేసిన తప్పిదం వల్ల అతనికి ఎల్లో కార్డ్ చూపించడంతోపాటు కెనడాకు పెనాల్టీ కిక్ లభించింది. అయితే బెల్జియం గోల్ కీపర్ థిబాట్ కర్టాయిస్ గోల్ అడ్డుుకున్నాడు.  ఆ తర్వాత  లభించిన  అవకాశాలను కూడా కెనడా సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరో రెండు నిమిషాల్లో మొదటి అర్థభాగం ముగుస్తుందన్న సమయంలో బెల్జియం గోల్ కొట్టింది.  43వ నిమిషంలో  మిచీ బాట్సుషాయి అద్భుతమైన కిక్తో గోల్ సాధించాడు. దీంతో  తొలి హాఫ్‌లో  బెల్జియం 1–0తో ఆధిక్యంలో నిలిచింది.

కెనడాకు దక్కని గోల్
ఫస్టాఫ్లో కొట్టిన గోల్తో బెల్జియం రెండో అర్థభాగంలోనూ ఉత్సాహంగా కనిపించింది. అయితే సెకండాఫ్లో గోల్ కొట్టేందుకు కెనడా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ బెల్జియం గోల్ కీపర్ కెనడా ఆశలపై నీళ్లు చల్లాడు. అటు బెల్జియం కూడా రెండో భాగంలో గోల్ కొట్టలేకపోయింది. అయినా..చివరకు 1–0తో విజయం సాధించింది.  దీంతో గ్రూప్ Fలో బెల్జియం మొదటి  విజయం సాధించింది. అంతేకాదు ఫిపా వరల్డ్ కప్ గ్రూప్ దశలో వరుసగా 8 విజయాలు సాధించిన జట్టుగా బ్రెజిల్ పేరిట ఉన్న రికార్డును సమం చేసింది.