కేసీఆర్ తిన్న అవినీతి సొమ్ము కక్కిస్తం : గడ్డం వినోద్

కేసీఆర్ తిన్న అవినీతి సొమ్ము కక్కిస్తం : గడ్డం వినోద్
  •     కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో సీఎం రూ.లక్ష కోట్లు మింగిండు
  •     బెల్లంపల్లి కాంగ్రెస్  అభ్యర్థి గడ్డం వినోద్ కామెంట్

బెల్లంపల్లి, వెలుగు : సీఎం కేసీఆర్  కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని మాజీ మంత్రి, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్  విమర్శించారు. కేసీఆర్  తిన్న అవినీతి సొమ్మును తాము అధికారంలోకి వచ్చాక కక్కిస్తామని ఆయన పేర్కొన్నారు. శనివారం బెల్లంపల్లి పట్టణంలో మాజీ మున్సిపల్  చైర్మన్  మత్తమారి సూరిబాబు నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆరో వార్డు రడగంబాల బస్తీకి చెందిన కొయ్యడ మల్లేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 130 మంది మహిళలు వినోద్  సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

ఈ సందర్భంగా వినోద్  మాట్లాడుతూ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు కుంగిపోవడంతో కేసీఆర్  అవినీతి బయటపడిందన్నారు. అవినీతి, భూ కబ్జాలకు మారుపేరుగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను ప్రజలు చిత్తుగా ఓడించాలని కోరారు. పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని, కేసీఆర్  అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సంఘటితం అవుతున్నారని అన్నారు.

బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్  బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, రామాలయ కమిటీ మాజీ చైర్మన్  మత్తమారి సత్తిబాబు, లీడర్లు  విజయ్ కుమార్, జావేద్ ఖాన్, మేకల శ్రీనివాస్, లెంకల శ్రీనివాస్, రామగిరి శ్రీనివాస్, దాసరి ప్రతాప్  పాల్గొన్నారు.