IPO News: నష్టాల మార్కెట్లో ఐపీవో లాభాల ఎంట్రీ.. మీరూ దీనిపై బెట్ వేశారా?

IPO News: నష్టాల మార్కెట్లో ఐపీవో లాభాల ఎంట్రీ.. మీరూ దీనిపై బెట్ వేశారా?

Belrise Industries IPO: ఒకపక్క మార్కెట్లు పతంతో ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తుంటే మరోపక్క ఐపీవోలు మాత్రం లాభాలతో ఊరిస్తున్నాయి. అవును ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు పతనంలో కొనసాగుతున్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అవుతున్న అనేక ఐపీవోలు మంచి రాబడులను తెచ్చిపెడుతున్నాయి. దీంతో బెట్టింగ్ వేసిన అదృష్టవంతులు లాభాలతో పండగ చేసుకుంటున్నారు. 

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది బెల్‌రైజ్ ఇండస్ట్రీస్ కంపెనీ ఐపీవో గురించే. మెయిన్ బోర్డ్ ఐపీవో షేర్లు నేడు ఎన్ఎస్ఈలో 11 శాతానికి పైగా లాభంతో రూ.100 వద్ద గ్రాండ్ ఎంట్రీ ఇవ్వగా.. బీఎస్ఈలో కంపెనీ షేర్లు 9.44 శాతం లాభపడి రూ.98.50 వద్ద తమ ట్రేడింగ్ స్టార్ట్ చేశాయి. వాస్తవానికి కంపెనీ తన ఐపీవో ఇష్యూ సమయంలో ఒక్కో షేరును రూ.90 ధరకు విక్రయించిన సంగతి తెలిసిందే.

తాజా ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.2వేల 150 కోట్లను సమీకరించింది. పైగా ఇందుకోసం 23కోట్ల 89 లక్షల తాజా ఈక్విటీ షేర్లను ఇన్వెస్టర్లకు విక్రయించింది. కంపెనీ లాట్ పరిమాణాన్ని 166 షేర్లుగా నిర్ణయించటంతో రిటైల్ పెట్టుబడిదారులు కనీసం రూ.14వేల 110 పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. అలాగే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.645 కోట్లను విజయవంతంగా సమీకరించింది. 

వాస్తవానికి గ్రేమార్కెట్లో లిస్టింగ్ ముందు వరకు 21-23 శాతం ప్రీమియం చూపించినప్పటికీ అందులో సగానికి నేడు స్టాక్ లిస్టింగ్ జరిగింది. అయినప్పటికీ మార్కెట్లు పతనంలో ఉండగా లాభాల్లో ముందుకు సాగటంపై పెట్టుబడిదారులు సంతోషంగా ఉన్నారు. ఐపీవో మూడు రోజుల సమయంలో 41 రెట్లు సబ్ స్క్రిప్షన్ అందుకుంది. కంపెనీ ప్రస్తుతం వచ్చిన మెుత్తంలో రూ.వెయ్యి 618 కోట్లను రుణ చెల్లింపులకు, కార్పొరేట్ అవసరాలకు వినియోగించాలని నిర్ణయించింది. 

కంపెనీ వ్యాపారం..
1988లో స్థాపించబడిన కంపెనీ ఆటో రంగంలో పనిచేస్తోంది. ఇది ప్రత్యేకంగా టూ-వీల్, త్రీ-వీల్, ఫోర్-వీల్ ప్యాసింజర్, కమర్షియల్ వాహనాల కోసం ఆటోమోటివ్ షీట్ మెటల్, కాస్టింగ్ భాగాలు, పాలిమర్ భాగాలు, సస్పెన్షన్ అండ్ మిర్రర్ సిస్టమ్‌లను తయారు చేస్తోంది. కంపెనీ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో మెటల్ ఛాసిస్ సిస్టమ్‌లు, పాలిమర్ కాంపోనెంట్‌లు, సస్పెన్షన్ సిస్టమ్‌లు, బాడీ-ఇన్-వైట్ కాంపోనెంట్‌లు, ఎగ్జాస్ట్ సిస్టమ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ ఉత్పత్తులకు బజాజ్, హోండా, హీరో, జాగ్వార్ ల్యాండ్ రోవర్, రాయల్ ఎన్‌ఫీల్డ్, విఈ కమర్షియల్ వెహికల్స్, టాటా మోటార్స్, మహీంద్రాగా ఉన్నాయి.