మునుగోడులో బెల్ట్​షాపులు క్లోజ్.. నియోజకవర్గంలో 2 వేల దుకాణాలు బంద్​

మునుగోడులో బెల్ట్​షాపులు క్లోజ్.. నియోజకవర్గంలో 2 వేల దుకాణాలు బంద్​

యాదాద్రి, వెలుగు :  నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బంద్ అయ్యాయి. దాదాపు 2 వేల దుకాణాలు క్లోజ్ అయ్యాయి. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలోని బెల్ట్​ షాపులన్నింటినీ మూసివేయిస్తానని అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలవడంతో ఎక్సైజ్, పోలీస్ ఆఫీసర్ల సహకారంతో నెల రోజుల వ్యవధిలోనే నియోజకవర్గంలోని దాదాపు 2 వేల బెల్ట్​ షాపులను క్లోజ్​ చేయించారు. గ్రామాల వారీగా కమిటీలు వేసి, బెల్ట్​ షాపులకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయించారు.దుకాణాల నిర్వాహకులకు అవగాహన కల్పించి, ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

159 గ్రామాల్లో 2 వేలకు పైగా..  

మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 159 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీల పరిధిలో 30 వార్డులు ఉన్నాయి. వైన్స్​లకు అనుబంధంగా ఒక్కో పంచాయతీ పరిధిలో పది, అంతకు మించి బెల్టు షాపులు నడుస్తున్నాయి. ఏ గల్లీలో చూసినా ప్రత్యేకంగా నడిచే బెల్టు షాపులతో పాటు చిన్న చిన్న హోటళ్లు, కిరాణా దుకాణాల్లోనూ విచ్చలవిడిగా లిక్కర్​అమ్ముతున్నారు. బెల్టు షాపులకు గ్రామాల్లో వేలంపాటలు కూడా నిర్వహిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో టార్గెట్ల కోసం ఆబ్కారోళ్లు, మామూళ్ల కోసం పోలీసోళ్లు, వేలంపాటల ద్వారా పంచాయతీలకు వచ్చే పైసల కోసం సర్పంచులు బెల్టు షాపులను ప్రోత్సహిస్తూ వచ్చారు. దీంతో నియోజకవర్గంలో 24 గంటలూ లిక్కర్ దొరుకుతున్నది. చిన్నాపెద్ద తేడా లేకుండా జనం లిక్కర్​కు అలవాటు పడుతున్నారు. మద్యం కారణంగా నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఇది గమనించిన కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో బెల్టు షాపులనే ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. తనను గెలిపిస్తే బెల్టు షాపులన్నింటినీ మూసివేయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు పెద్ద సంఖ్యలో ఆయనకు మద్దతు పలికారు.

ఊరూరా కమిటీలు వేయించి..

తాను ఎమ్మెల్యేగా గెలవడం, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బెల్టు షాపులను మూసివేయించేందుకు రాజగోపాల్​రెడ్డి వెంటనే కార్యాచరణ చేపట్టారు. ముందుగా ఎక్సైజ్ ఆఫీసర్లు, పోలీసులతో సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని బెల్టు షాపుల లెక్క తీశారు. తన అనుచరులు, కాంగ్రెస్​నేతలతో గ్రామాల వారీగా కమిటీలు వేయించి.. ఊరూరా బెల్టు షాపులకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయించారు. దుకాణాల నిర్వాహకులను పిలిపించి ఎక్సైజ్, పోలీస్​ఆఫీసర్ల ద్వారా అవగాహన కల్పించారు. వెంటనే బెల్టుషాపులు బంద్​పెట్టి ప్రత్యామ్నాయ ఉపాధి వెతుక్కోవాలని సూచించారు. ఉపాధి దొరకనోళ్లకు తానే వ్యక్తిగతంగా సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. దీంతో శుక్రవారం వరకు నియోజకవర్గంలో దాదాపు 2 వేల బెల్టు షాపులు మూతపడ్డాయి. కాగా, బెల్టు షాపులను మూసివేయడంతో జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డికి పాలాభిషేకాలు చేశారు.