అంతర్జాతీయ సదస్సుకు హెచ్ సీయూ పరిశోధన పత్రం

అంతర్జాతీయ సదస్సుకు హెచ్ సీయూ పరిశోధన పత్రం
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ రావుల కృష్ణయ్యకు దక్కిన అరుదైన గౌరవం 
  • సూర్యాపేట జిల్లా పాలకీడు మండల వాసుల్లో ఆనందం 

పాలకవీడు, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రావుల కృష్ణయ్య అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు. హెచ్ సీయూలో  విద్యావిభాగానికి చెందిన అధ్యాపకుడు కృష్ణయ్య పరిశోధన పత్రం జర్మనీలోని మనోవర్ సిటీలో ఈనెల19 నుంచి 21 వరకు నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైంది. ఈ సందర్భంగా సదస్సు నిర్వాహకులు పరిశోధన నాణ్యతను గుర్తిస్తూ కృష్ణయ్యకు 600 యూరోలు గ్రాంట్ గా మంజూరు చేశారు.  

వర్సిటీ రీసెర్చ్ స్కాలర్ సాక్షితో సంయుక్తంగా కృష్ణయ్య ఉన్నత విద్యలో కథన పద్ధతుల ద్వారా సుస్థిరతను పెంపొందించడంపై పరిశోధన పత్రం రూపొందించారు. ఇది  ప్రపంచవ్యాప్తంగానూ ప్రశంసలు పొందింది. సృజనాత్మక బోధనా విధానాలు, సాంస్కృతిక ఆధారిత విద్యపై హెచ్ సీయూ అందిస్తున్న ప్రోత్సాహానికి ఈ ఎంపిక మరో గుర్తింపుగా నిలిచింది. 

సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం మూసిఒడ్డు  సింగారం గ్రామానికి చెందిన డాక్టర్ రావుల కృష్ణయ్యకు అంతర్జాతీయ గుర్తింపు దక్కడంపై మండలవాసులు ఆనందం వ్యక్తం చేశారు. కృష్ణయ్య పశువుల కాపరిగా, సెక్యూరిటీ గార్డుగా, విద్యా వలంటీర్‌గా పనిచేస్తూనే డిగ్రీ, పీజీ, పీహెచ్ డీ పూర్తి చేసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ స్థాయికి ఎదిగారు.