ఐటీ షేర్లు ఢమాల్‌‌

ఐటీ షేర్లు ఢమాల్‌‌
  • రిజల్ట్స్ బాగుండవనే అంచనాలతో పడిన మేజర్ ఐటీ షేర్లు 

ముంబై: టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌‌సీఎల్‌‌ టెక్ వంటీ మేజర్  ఐటీ కంపెనీల షేర్లు పడడంతో గురువారం లాభాల్లో  ఓపెన్ అయిన బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌‌ 65 పాయింట్లు (0.1 శాతం) తగ్గి 66,408 దగ్గర ఫ్లాట్‌‌గా క్లోజయ్యింది. నిఫ్టీ 17 పాయింట్లు పడి 19,794 దగ్గర సెటిలయ్యింది. సెన్సెక్స్‌‌లో ఇన్ఫోసిస్‌‌, టెక్ మహీంద్రా, టీసీఎస్‌‌, హెచ్‌‌సీఎల్‌‌ టెక్‌‌ షేర్లు 2.8 శాతం వరకు నష్టపోయాయి. 

బజాజ్ ఫైనాన్స్‌‌, విప్రో, నెస్లే, కోటక్ బ్యాంక్‌‌, ఎస్‌‌బీఐ షేర్లు కూడా నెగెటివ్‌‌లో ముగిశాయి. మారుతి, పవర్ గ్రిడ్‌‌, ఎన్‌‌టీపీసీ, ఎం అండ్ ఎం షేర్లు లాభాల్లో క్లోజయ్యాయి. వాల్యూ ఇన్వెస్టర్‌‌‌‌ పొరింజు వెలియత్‌‌  షేరు హోల్డర్‌‌‌‌గా మారడంతో స్మాల్‌‌ క్యాప్ కంపెనీ సింగర్ ఇండియా షేర్లు గురువారం 10 శాతం పెరిగాయి. బ్రోకరేజ్ కంపెనీ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ జొమాటో టార్గెట్ ధరను రూ.120 నుంచి రూ.160 కి పెంచింది. దీంతో కంపెనీ షేర్లు ఇంట్రాడేలో రూ.113.25 దగ్గర సరికొత్త ఏడాది గరిష్టాన్ని నమోదు చేశాయి. సెక్టార్ల పరంగా చూస్తే నిఫ్టీ ఐటీ 1.67 శాతం క్రాష్ అవ్వగా, బజాజ్‌‌ ఆటో,   టీవీఎస్‌‌, బోష్‌‌, మారుతి షేర్లు పెరగడంతో నిఫ్టీ ఆటో ఇండెక్స్ లాభాల్లో ముగిసింది. బ్రాడ్ మార్కెట్‌‌లో నిఫ్టీ మిడ్‌‌క్యాప్ 100, స్మాల్‌‌ క్యాప్‌‌ 100 ఇండెక్స్‌‌లు  స్వల్పంగా లాభపడ్డాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 83.24 దగ్గర సెటిలయ్యింది. 

ఎనలిస్టులు ఏమంటున్నారంటే?

పెద్ద ఐటీ కంపెనీల రిజల్ట్స్‌‌ మెప్పించలేకపోవడం, సమీప కాలంలో రెవెన్యూ పడిపోతుందనే సంకేతాలు ఇవ్వడంతో మొత్తం ఐటీ సెక్టార్‌‌‌‌పై ఒత్తిడి పెరిగిందని   జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌ వినోద్ నాయర్ వెల్లడించారు. బ్రాడ్‌‌ మార్కెట్‌‌ స్ట్రాంగ్‌‌గా ఉందని చెప్పారు. గ్లోబల్ ఎకానమీ బాగోలేకపోయినా ఇండియాలో డిమాండ్ పుంజుకోవడంతో కంపెనీల క్యూ2 రిజల్ట్స్ బాగుంటాయని ఆయన అన్నారు.

గ్లోబల్ మార్కెట్స్‌‌..

యూఎస్‌‌ ఇన్‌‌ఫ్లేషన్ డేటా వెలువడే ముందు గ్లోబల్‌‌ మార్కెట్‌‌లు లాభాల్లో కదిలాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ మినిట్స్‌‌ కూడా రానుండడంతో మార్కెట్‌‌ పాజిటివ్‌‌గా ట్రేడయ్యింది. ఇజ్రాయెల్‌‌ – హమాస్‌‌ వార్‌‌‌‌తో మార్కెట్‌‌లు జాగ్రత్త పడుతున్నప్పటికీ యూరోపియన్ మార్కెట్‌‌లు గురువారం ఫ్లాట్‌‌గా కదిలాయి. టోక్యో, షాంఘై, హాంకాంగ్‌‌, సియోల్‌‌ మార్కెట్‌‌లు లాభాల్లో ముగిశాయి.