
ముంబై : బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారం సెషన్‌లో దూసుకుపోయాయి. కీలకమైన 19,875 లెవెల్‌ను కిందటి సెషన్‌లో క్రాస్ చేసిన నిఫ్టీ, బుధవారం 200 పాయింట్లు ర్యాలీ చేసి 20 వేల లెవెల్‌ను ఈజీగా దాటింది. బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. సెన్సెక్స్ 728 పాయింట్లు పెరిగి 66,902 దగ్గర, నిఫ్టీ 207 పాయింట్లు లాభపడి 20,096 దగ్గర సెటిలయ్యాయి.
‘మార్కెట్‌కు కొత్త జోష్ వచ్చింది. డొమెస్టిక్ ఇన్వెస్టర్లు మార్కెట్‌కు సపోర్ట్‌గా ఉండగా, యూఎస్ బాండ్ ఈల్డ్ గరిష్టాల్లో ఉండడంతో విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ల(ఎఫ్‌పీఐల) ఇన్‌ఫ్లోస్ తగ్గాయి. యూఎస్‌లో వడ్డీ రేట్లు పీక్ లెవెల్‌కు చేరుకోవడం, డాలర్ ఇండెక్స్ దిగొస్తుండడంతో ఎఫ్‌పీఐల ఇన్‌ఫ్లోస్ పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ ఎనలిస్ట్ సంతోష్ మీనా అన్నారు.
యూఎస్ జీడీపీ..
యూఎస్ జీడీపీ గ్రోత్ రేట్ ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో 5.2 శాతంగా రికార్డయ్యింది. 5 శాతం ఉంటుందని ఎనలిస్టులు అంచనావేశారు. అంతకు ముందు క్వార్టర్‌లో ఈ నెంబర్ 4.9 శాతంగా నమోదయ్యింది.
మార్కెట్ ఎందుకు పెరిగిందంటే!
1. ఇన్‌ఫ్లేషన్ తగ్గితే రానున్న నెలల్లో వడ్డీ రేట్లను తగ్గించే ఛాన్స్ ఉందని ఫెడ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ కామెంట్ చేశారు.
2. గత రెండు నెలలుగా మార్కెట్‌లో నికర అమ్మకందారులుగా కొనసాగిన ఎఫ్‌పీఐలు, కొన్ని సెషన్లుగా నెట్ బయ్యర్లుగా మారారు. మంగళవారం డేటా చూస్తే ఎఫ్‌పీఐలు నికరంగా రూ.784 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
3. కొన్ని సెషన్లుగా పెద్ద కంపెనీల కంటే స్మాల్, మిడ్ క్యాప్ షేర్లకు ప్రాధాన్యం ఇచ్చిన ఇన్వెస్టర్లు, బుధవారం సెషన్‌లో పెద్ద కంపెనీల షేర్లను భారీగా కొనుగోలు చేశారు. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లు ఒకటిన్నర శాతం ర్యాలీ చేశాయి. యాక్సిస్ బ్యాంక్ 3.7 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2 శాతం లాభపడ్డాయి.
4. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు నెలకొన్నప్పటికీ బుధవారం ఆసియా మార్కెట్‌లు నష్టాల్లో కదిలాయి. జపాన్, హాంకాంగ్, షాంఘై మార్కెట్‌లు నెగెటివ్‌లో ముగిశాయి. మరోవైపు యూరోపియన్ మార్కెట్‌లు మిశ్రమంగా ట్రేడయ్యాయి.
5. రానున్న కొన్ని నెలల్లో ఔట్‌పుట్ పాలసీని ఒపెక్ ప్లస్ తీసుకురానుంది. ఈ మీటింగ్‌కు ముందు ఇన్వెస్టర్లు జాగ్రత్త వహిస్తున్నారు. మరోవైపు నల్ల సముద్రంలో తుఫాన్ ఏర్పడడంతో సప్లయ్ సమస్యలు నెలకొన్నాయి. ఫలితంగా క్రూడాయిల్ రేట్లు బుధవారం పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌కు 82.23 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. డబ్ల్యూటీఐ క్రూడ్ బ్యారెల్‌కు 77.11 డాలర్ల దగ్గర ఉంది. ఈ రెండు కూడా గత రెండు నెలల్లో 16 శాతం మేర తగ్గాయి.
6. వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని ఫెడ్ అధికారులు సంకేతాలు ఇవ్వడంతో యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ బుధవారం కొన్ని నెలల కనిష్టానికి పడిపోయాయి. రెండేళ్ల ట్రెజరీ ఈల్డ్ 4.69 శాతానికి తగ్గగా, 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్ 4.28 శాతానికి పడింది.
7. డాలర్ ఇండెక్స్ 102.87 దగ్గర ఉంది. గత నెల రోజుల్లో ఈ ఇండెక్స్ 3.7 శాతం తగ్గింది. డాలర్ ఇండెక్స్ 103 లెవెల్ కిందకి పడడంతో మన మార్కెట్ పెరుగుతోంది. డాలర్ మారకం లో రూపాయి విలువ బుధవారం
83.32 దగ్గర సెటిలయ్యింది.
టాప్ 20 లోకి గౌతమ్ అదానీ రీఎంట్రీ!
కిందటి సెషన్‌లో అదానీ గ్రూప్ షేర్లు ర్యాలీ చేయడంతో గౌతమ్ అదానీ తిరిగి గ్లోబల్ టాప్ 20 రిచ్‌లిస్ట్‌లో జాయిన్ అయ్యారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, గౌతమ్ అదానీ సంపద 66.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన లిస్టులో ఆయన 19 వ ప్లేస్‌లో ఉన్నారు. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ నిజమని చెప్పడం లేదని సుప్రీం కోర్ట్ కామెంట్ చేయడంతో అదానీ గ్రూప్ షేర్లు దూసుకుపోతున్నాయి. మంగళవారం సెషన్‌లో గ్రూప్ కంపెనీల షేర్లు 5 నుంచి 20 శాతం వరకు లాభపడ్డాయి. బుధవారం సెషన్‌లో మాత్రం కొద్దిగా నష్టపోయాయి.