నారాయణపేటలో ఇచ్చిన జాగలు గుంజుకుంటున్రు!

నారాయణపేటలో ఇచ్చిన జాగలు గుంజుకుంటున్రు!

నారాయణపేట, వెలుగు: మున్సిపాలిటీ పరిధిలో గత ప్రభుత్వాలు ఇచ్చిన తమ ఇండ్ల జాగలను గుంజుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఆయా స్థలాలలో, కట్టిన ఇండ్లలో లబ్ధిదారులు నివాసం ఉంటలేరని, పట్టాలు రద్దు చేస్తామని నోటీసులు పంపుతున్నారని వాపోతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో నిరుపేదలమైన తమకు ఇచ్చిన స్థలాలకు డిమాండ్​పెరగడంతో  రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా లాక్కోవాలని చూస్తోందని, తమ ప్రాణాలు పోయినా సరే స్థలాలను వదులుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. 

టీడీపీ, కాంగ్రెస్​ప్రభుత్వాల హయాంలో..

పట్టణ పరిధిలో నివసిస్తున్న నిరుపేదలకు 1998, 2004 లో ఉట్కూర్ మండలం వల్లంపల్లి రెవెన్యూ  శివారులోని సర్వే నంబర్​ 67,48 లలో 1,007 మంది లబ్ధిదారులకు100 గజాల చొప్పున అప్పటి టీడీపీ, కాంగ్రెస్​ప్రభుత్వాలు ఇండ్ల స్థలాలు కేటాయించాయి. టీడీపీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో సర్వేనంబర్​ 67 లో  357 ఇండ్ల స్థలాలు  ఇచ్చారు.  ఇక్కడ మైనారిటీ కాలనీ ఏర్పాటు చేశారు. 2007లో అప్పటి ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్​రెడ్డి ఆధ్వర్యంలో సర్వేనంబర్​48లో 650 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. రాంమ్మోహన్​రెడ్డి ‘ఆదర్శ ఇందిరమ్మ గృహ పథకం’ కింద  ఎమ్మెల్యే కోటాలో కొన్ని  ఇండ్లు కూడా కట్టించారు.  ఇండ్ల నిర్మాణం కోసం  2010లో ఒక్కో లబ్ధిదారునికి రూ. 40 వేలు లోను ఇచ్చింది. 

ఇండ్లు పూర్తిగా కట్టని కాంట్రాక్టర్​

ఇందిరమ్మ గృహ పథకంలో భాగంగా  కాంట్రాక్టర్​తనకు గిట్టుబాటు అయితలేదని ఇండ్ల నిర్మాణం మధ్యలోనే ఆపేశాడు. దీంతో అధికారుల సూచన మేరకు లబ్ధిదారులు  ఒక్కొక్కరు రూ.15,000- కాంట్రాక్టర్ కి చెల్లించారు. అయినా కాంట్రాక్టర్​ నిర్మాణాలు పూర్తి చేయకుండా అసంపూర్తిగాను, కొన్ని అసలు స్టార్ట్​ చేయకుండానే వెళ్లిపోయాడు. దీంతో లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణ వచ్చిన తర్వాత  రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలనీల్లో డబుల్​బెడ్​రూం ఇండ్లు కట్టివ్వాలని లేకపోతే ఇండ్లు కట్టుకోవటానికి ఏదైనా పథకం కింద ఫండ్స్​శాంక్షన్​కాలనీల వాసులు  ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగారు. అయినా వారు పట్టించుకోలేదు.

పట్టాలు రద్దు చేస్తమని  నోటీసులు

ఇండ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో పాటు కా లనీలో ప్రభుత్వం ఎలాంటి మౌలిక వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులు అక్కడ ఉండలేకపోయారు. దీంతో స్థలాల్లో నివాసం ఉంటలేరని ఉట్కూర్ తహసీల్దార్​ పట్టాలు రద్దు చేస్తమని ఈ ఏడాది మార్చి నెలలో  నోటీసులు ఇచ్చారు. లబ్ధిదారులు తాము అక్కడే ఉంటున్నామని, ప్రభుత్వం తమకు ఇచ్చిన స్థలాలు ఎలా రద్దు చేస్తరని ప్రశ్నించారు. కానీ అధికారులు అదేమీ పట్టించుకోకుండా చిట్టెం నర్సిరెడ్డి కాలనీని నేలమట్టం చేశారు.  అధికారుల తీరును నిరసిస్తూ లబ్ధి దారులు హైకోర్టులో రిట్ వేసి స్టేటస్ కో ఆర్డర్ పొందారు. అయినా కోర్టు ఆర్డర్స్​ను పట్టించుకోకుండా తహసీల్దార్​ ఇండ్లు ఖాళీ చేయాలని  బెదిరిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. 

మమ్మల్ని చంపి తీసుకొండి.. 

 తమ ఇండ్ల స్థలాలను  ప్రభుత్వం గుంజుకోవాలనుకుంటే  మమ్ముల్ని చంపి తీసుకోవాలి. రోజువారి కూలీ చేసే తమకు ఇండ్లు కట్టుకునే స్థోమత లేక కట్టుకోలేదు. ఎప్పటికైనా ఇండ్లు కట్టుకుంటాం. ఎవరు ఎంత బెదిరించినా ఇంచు స్థలం కూడా ఇవ్వం. స్థానిక ప్రజాప్రతినిధులు మాకు న్యాయం చేయాలి.
- నాగేందర్​ ధోత్రే, గాంధీనగర్ 


పేదల భూములు గుంజుకునుడేంది?


పేదలకు ఇచ్చిన స్థలాలపైనే ప్రభుత్వం కన్నుపడిందా..?  బడాబాబులు కబ్జా చేస్తే వెనుకేసుకొచ్చే అధికారులు.. తమ భూములపై ఎందుకు గుంజుకోవాలె. ఓట్ల కోసం వచ్చే అధికారులు ఇప్పుడు ముఖం చాటే స్తున్నారు. తమకు న్యాయం చేయాలి.
- హమీదా, బహర్​పేట