మాల్దా: బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసుకునేందుకు ఈసీ ఏడు దశల్లో ఎన్నికలను నిర్వహిస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రధాని మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు ప్రచారం చేసుకోవడానికీ ఈసీ అన్ని దశల్లో ఎన్నికలు నిర్వహిస్తుందని తెలిపారు. శనివారం గజోల్లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ‘‘ఎన్నికలు గతంలో మే నాటికి ముగిసేవి. కానీ, మోదీ సైనిక విమానాలలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ ఏడాది జూన్ 1 వరకు పొడిగించారు. హెలికాప్టర్లతో సహా అన్నింటిని బీజేపీ నేతలు బుక్ చేసుకున్నారు.
మాకు అందుబాటులో లేకుండా చేశారు” అని దీదీ విమర్శించారు. ప్రధాని మోదీ చెప్పినట్టు ఈసీ నడుచుకుంటుందని ఆరోపించారు. సీపీఎం, కాంగ్రెస్ రాష్ట్రంలో బీజేపీని బలపరుస్తున్నాయని వారికీ ఓటు వేయొద్దని ప్రజలను కోరారు. ‘‘నేను విపక్షాల కూటమికి ఇండియా బ్లాక్ అని పేరు పెట్టాను. కానీ, బెంగాల్లో ఇండియా బ్లాక్ లేదు. రాష్ట్రం వెలుపల మాత్రమే ఉంది. బీజేపీ దుశ్చర్యలను ప్రశ్నించినందుకు మా ఎంపీ మహువా మొయిత్రాను పార్లమెంటు నుంచి బహిష్కరించారు. ప్రార్థనా స్థలాలను మేం నిర్మిస్తుంటే బీజేపీ వాటిని ధ్వంసం చేస్తోంది. రామ మందిరం గురించి బీజేపీ ప్రగాల్భాలు పలుకుతుంది” అని మమత విమర్శించారు.
