బీర్భూమ్ బాధితులను పరామర్శించిన దీదీ

బీర్భూమ్ బాధితులను పరామర్శించిన దీదీ

బెంగాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న బీర్భూమ్లో  సీఎం మమతా బెనర్జీ పర్యటించారు. బొగ్తూయ్లోని బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించారు. చనిపోయిన వారి కుటుంబసభ్యులకు రూ.5లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు. హింసాత్మక ఘటనల్లో కాలిపోయిన ఇళ్ల పునర్నిర్మాణానికి రూ.2లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు చెప్పారు. ఘర్షణల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఉద్యోగం ఇస్తామన్న దీదీ.. బాధితులకు తక్షణ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్యటన నేపథ్యంలో బొగ్తూయ్లో భద్రత కట్టుదిట్టం చేశారు.

బెంగాల్లో మంగళవారం జరిగిన హింసాత్మక ఘటనల్లో బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్హట్ శివారులోని బొగ్తూయ్ గ్రామంలో 8 ఇంండ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 8 మంది సజీవ దహనమయ్యారు. సోమవారం రాత్రి బర్షాల్ గ్రామానికి చెందిన టీఎంసీ నేత భదు హత్యకు గురయ్యారు. హత్య జరిగిన గంటల వ్యవధిలోనే దుండగులు ఇండ్లకు నిప్పు పెట్టారు. ఘటనాస్థలంలోనే ఏడుగురు పూర్తిగా కాలిపోగా.. ఒకరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 11 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.