
కోల్‌కతా : కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఎక్కువకాలం కొనసాగదని, త్వరలోనే కూలిపోతుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం బెదిరింపులతో ఏర్పడిందని, ఇది స్థిరమైన ప్రభుత్వం కాదని తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతోపాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేసి, ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.
ఆదివారం అధికార టీఎంసీ నిర్వహించిన అమరవీరుల దినోత్సవ ర్యాలీలో సీఎం మమత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమిలోని మిత్రపక్షాలు ఆర్థిక ప్రయోజనం కోసం మంత్రి పదవులను త్యాగం చేస్తున్నాయని ఆరోపించారు. వారు పిరికిపందలు, అత్యాశాపరులని ఎవరి పేరునూ ప్రస్తావించకుండా ఎన్డీయే మిత్రపక్షాలపై విరుచుకుపడ్డారు.
డబ్బుల కోసం మంత్రి పదవులను వదులుకున్నట్టు ఎప్పుడైనా విన్నామా? అని ప్రశ్నించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ లోక్‌సభ ఎన్నికల ప్రదర్శనపై ఆమె ప్రశంసలు కురిపిచారు. “మీరు లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన ప్రదర్శన చూసి యూపీలో బీజేపీ సర్కారు రాజీనామా చేసి ఉండాలి. కానీ.. బీజేపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ అధికారంలోనే కొనసాగుతున్నది” అని అఖిలేశ్‌ను ఉటంకిస్తూ వ్యాఖ్యానించారు.
నిస్సహాయులకు ఆశ్రయమిస్తాం..
బంగ్లాదేశ్ నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తామని మమతా బెనర్జీ తెలిపారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అల్లర్లపై తాను మాట్లాడలేనని, దీనిపై భారత ప్రభుత్వం మాట్లాడాలని అన్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన నిస్సహాయ ప్రజలు తమ తలుపు తడితే.. వారికి ఆశ్రయం కల్పించి తీరుతామని దీదీ స్పష్టం చేశారు.
మోదీ సర్కారు కూలడం ఖాయం: అఖిలేశ్
కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఎక్కువ కాలంపాటు కొనసాగదని, మోదీ ప్రభుత్వం త్వరలోనే కూలడం ఖాయమని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం నడిచేది కాదు.. ఇంటికి పోయే సర్కార్ అని ఎద్దేవా చేశారు.