మమతకు ఓటేయనందుకే దాడులు

మమతకు ఓటేయనందుకే దాడులు

కూచ్ బెహర్ (వెస్ట్ బెంగాల్):దేశమంతా కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే.. వెస్ట్ బెంగాల్ మాత్రం కరోనా విపత్తుతో పాటు ఎన్నికల తర్వాత హింస రూపంలో రెండు సవాళ్లను ఎదుర్కొంటోందని ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్ కర్ అన్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు రూలింగ్ పార్టీకి కాకుండా, తమ ఇష్ట ప్రకారం ఓట్లు వేసినందుకే ఇప్పుడు దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కూచ్ బెహర్ జిల్లాలో ఇటీవల ఎన్నికల తర్వాత హింస జరిగిన పలు ప్రాంతాల్లో గవర్నర్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నవాళ్లను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఎన్నికల తర్వాత హింసకు సంబంధించి సమాచారం అడిగితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని ఆయన చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేయలేదన్న కారణంతో దాడులు చేస్తున్నారని, మహిళలు, పిల్లలను కూడా వదలడం లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను రాజ్యాంగబద్ధంగా తనకు ఉన్న విధులను నిర్వర్తించి తీరుతానన్నారు. సీఎం మమత ఎన్నికలటైంలోనే రెచ్చగొట్టారని, ఇలాంటి ప్రవర్తన సరికాదన్నారు. బెంగాల్ లో టీఎంసీ దాడులకు భయపడి బీజేపీ వర్కర్లు అస్సాం పారిపోయి క్యాంపుల్లో తలదాచుకుంటున్నారని, శుక్రవారం తాను ఆ క్యాంపులను కూడా విజిట్​ చేస్తానని తెలిపారు.  

నల్లజెండాలతో నిరసనలు

గవర్నర్ ధన్ కర్ గురువారం కూచ్ బెహర్ లోని మాతాభంగ నుంచి సిటాల్ కుచికి వెళ్తుండగా, దారి పొడవునా టీఎంసీ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసనలు తెలిపారు. సిటాల్ కుచిలో పలువురు బాధితులను గవర్నర్ పరామర్శించారు. ఈ సందర్భంగా తమను కాపాడాలంటూ పలువురు మహిళలు ఆయన కాళ్లపై మీద పడి వేడుకున్నారు. తమ ఇండ్లన్నీ లూటీ చేశారని, మగవాళ్లంతా ప్రాణభయంతో ఇండ్లు విడిచి పారిపోవాల్సి వచ్చిందన్నారు.