ఎలా నడిపావురా అయ్యా : చలాన్లు కట్టే బదులు.. కొత్త బండే వస్తుంది

ఎలా నడిపావురా అయ్యా : చలాన్లు కట్టే బదులు.. కొత్త బండే వస్తుంది

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై పోలీసులు చలాన్లు విధిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓ బైక్‌పై ఉన్న ట్రాఫిక్ చలాన్ల మొత్తం చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ బండిపై ఏకంగా 255 ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి. ఆ చలాన్లు మొత్తం కలిసి రూ.1.34 లక్షలు ఉన్నాయి. చివరికి గుర్తించిన పోలీసులు.. ఆ బండి యజమానిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.  

 వాహనాలు రోడ్డు ఎక్కుతున్నాయంటే చాలు.. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించేవారిని ట్రాఫిక్ పోలీసులు నిఘా వేసి మరీ పట్టుకుంటారు. తమ వద్ద ఉన్న కెమెరాలతో నెంబర్ ప్లేట్లను క్లిక్‌మనిపించి చలాన్లు వేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వాహనదారులు కూడా ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి మాత్రం ఏకంగా 255 సార్లు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. దీంతో అతడి స్కూటీపై భారీగా జరిమానా విధించారు. ఎంతలా అంటే ఆ స్కూటీ మీద ఉన్న ట్రాఫిక్ చలాన్ల మొత్తం చూసి పోలీసులే నోరెళ్ల బెట్టారు. ఎందుకంటే 255 చలాన్లకు మొత్తంగా రూ.1.34 లక్షల ఫైన్లు వేశారు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది.

బెంగళూరుకు చెందిన ఎలుమలై అనే వ్యక్తి పేరు మీద ఉన్న స్కూటీ గత రెండేళ్ల నుంచి 255 సార్లు ట్రాఫిక్ రూల్స్‌ని ఉల్లంఘించింది. ఇందుకు ఆ వ్యక్తికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు రూ.1.34 లక్షల జరిమానా విధించారు. అయితే ఇటీవల పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల లెక్క తీసిన బెంగళూరు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సెంటర్.. ఈ వ్యక్తిపై నమోదైన చలాన్లను చూసి ఖంగుతిన్నారు. దీంతో వెంటనే బకాయిలు చెల్లించాలని ఎలుమలైకి నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనతో అలర్ట్ అయిన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సెంటర్ వెంటనే బెంగళూరులోని అన్ని పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం అందించారు. ఇలాంటి వాహనాలను గుర్తించి.. పేరుకుపోయిన జరిమానాలను వసూలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 

స్కూటీ యజమాని ఎలుమలై రూ. 10 వేలు కట్టి 20 చలాన్లు పరిష్కరించారు. ఇంకా పెండింగ్​ ఉండటంతో ఎలుమలైకి చెందిన సుజుకీ యాక్సెస్ స్కూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్ల కాలంలో 50 కంటె ఎక్కువ చలాన్లు ఉన్నవారిపై బెంగళూరు పోలీసులు దృష్టి సారించారు.