రాపిడో బైక్ డ్రైవర్లపై దాడి.. బంద్ అయితే ఎలా బుకింగ్స్ ఇస్తారు

రాపిడో బైక్ డ్రైవర్లపై దాడి.. బంద్ అయితే ఎలా బుకింగ్స్ ఇస్తారు

కర్ణాటకలో  ప్రైవేటు వాహనాల డ్రైవర్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న శక్తి పథకానికి వ్యతిరేకంగా ప్రైవేటు వాహనాల సంఘం సభ్యులు నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రైవేటు వాహనాల డ్రైవర్లు నానా హంగామా చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న శక్తి పథకానికి వ్యతిరేకంగా బెంగుళూరు బంద్కు  ప్రైవేట్ వాహనాలు అసోసియేషన్లు పిలుపునిచ్చాయి. అయితే తమ బంద్ ను పట్టించుకోకుండా రోడ్లపైకి వచ్చిన రాపిడో బైకర్లు, ఇతర ప్రైవేటు కార్ల డ్రైవర్లపై ప్రైవేటు వాహనాల అసోసియేషన్ల ప్రతినిధులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. 

బైక్ ట్యాక్సీ డ్రైవర్పై దాడి

బెంగుళూరులోని ఆనంద్ రావ్ సర్కిల్ ఫ్లైఓవర్ దగ్గర నిరసన తెలిపిన ప్రైవేటు వాహనాల అసోసియేషన్ల ప్రతినిధులు బైక్ -టాక్సీ రైడర్‌ను దారుణంగా కొట్టారు. బైకును ధ్వంసం చేశారు. రోడ్డు పక్కన బైకును పడేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 

బైక్ ట్యాక్సీ రైడర్‌పై దాడి చేస్తున్న ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. బెంగుళూరులోని బాణసవాడిలో ఆందోళనకారులు  బైక్ టాక్సీ రైడర్‌ను తీవ్రంగా దూషించారు.  ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తుండగా..అదే దారిలో బైక్ ట్యాక్సీ డ్రైవర్ వెళ్తున్నాడు. దీంతో అతన్ని ఆపిన నిరసనకారులు..కొట్టారు.  బైక్‌ను ధ్వంసం చేసి ప్రధాన రహదారిపైనే పడేశారు.  ఆందోళనకారులు బైక్ టాక్సీ రైడర్ హెల్మెట్‌ను కూడా పగలగొట్టారు. 

డ్రైవర్లపై ఉమ్మివేసి..

బెంగుళూరు నగరంలో పసుపు నంబర్‌ ప్లేట్లు ఉన్న కార్లపై కూడా ఆందోళనకారులు దాడి చేశారు.  కార్లను మార్గమధ్యంలో నిలిపివేశారు. ఆ తర్వాత కార్ల డ్రైవర్లకు పూలమాల వేసి వారి ముఖంపై ఉమ్మివేశారు.  అలాగే డ్రైవర్‌పై ఉమ్మి వేసిన ఘటన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

అసలేంటి వివాదం..ఎందుకు బంద్..

కర్ణాటక ఎన్నికల్లో  కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో శక్తి పథకం ఒకటి. ఈ పథకంలోకి భాగంగా  మహిళలకు  ఉచిత బస్ సౌకర్యం కల్పించింది. అయితే కర్ణాటకలో ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రైవేట్ వాహనాల్లో మహిళలు ఎక్కడం ఆపేశారు. దీంతో వారి గిరాకీ బాగా తగ్గిపోయింది. దీంతో శక్తి పథకాన్ని కేవలం  ప్రైవేటు బస్సులకు కూడా విస్తరించాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పథకంతో తమకు జీవనోపాధి లేకుండా పోయిందని వాపోయారు.  ఇప్పటికే ప్రభుత్వంతో పలు మార్లు చర్చలు జరిపినా.. ప్రయోజనం లేకుండా పోయవడంతో..బంద్ కు పిలుపునిచ్చారు.  ప్రైవేటు వాహనాల  ఫెడరేషన్‌లో మొత్తం 32 ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టేషన్‌ అసోసియేషన్స్ ఉన్నాయి. బంద్ తో  దాదాపు 10 లక్షల ప్రైవేట్ వాహనాలు నిలిచి పోయాయి.

ప్రైవేటు వాహనాల అసోసియేషన్ ప్రతినిధుల వివాదంపై కర్ణాటక  రవాణా మంత్రి రామలింగా రెడ్డి స్పందించారు. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్ రూ.1000 కోట్ల పరిహారం అడుగుతున్నారని వివరించారు.