
కర్ణాటక రాజధాని బెంగుళూరులో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు ఇద్దరు మృతి చెందారు. ఒకే రోజు ఇద్దరు కాల్వలో మునిగి చనిపోవడంతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇందులో ఓ వ్యక్తి మృతదేహాం 5 కిలో మీటర్ల వరకు కొట్టుకుపోయింది.
5 కి.మీల తర్వాత డెడ్ బాడీ
కెంపపురా అగ్రహారంలో 32 ఏళ్ల లోకేష్ అనే వ్యక్తి జారిపడి పడిపోయాడు. అయితే వరదల ధాటికి అతను మైసూర్ రోడ్డులో దాదాపు 5 కిలోమీటర్ల వరకు కొట్టుకుపోయాడు. చివరకు లోకేష్ మృతదేహాన్ని బైటరాయణపురలో కనుగొన్నారు. ఈ ఘటనకు సంబంధించి కెంపాపుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అయితే మురికి కాల్వ లోతును అంచనా వేయలేక ప్రమాదవశాత్తు కాలు జారి లోకేష్ పడిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పోలీసుల వాదనను కుటుంబ సభ్యులు ఖండించారు. తెరిచి ఉన్న డ్రైనేజీలోలో పడిపోయి కొట్టుకుపోయాడని..మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
అండర్ పాస్ లో చిక్కుకుని మృతి..
బెంగుళూరులో వర్షాల కారణంగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మృతి చెందింది. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్న 23 ఏళ్ల మహిళ తన కుటుంబంతో కలిసి కారులో వెళ్తోంది. అయితే భారీ వర్షాల కారణంగా బెంగళూరులోని కర్ణాటక అసెంబ్లీ సమీపంలోని కేఆర్ సర్కిల్ అండర్‌పాస్ వద్ద భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. ఈ వరదలో కారు ఇరుక్కుపోయింది. అండర్‌పాస్‌లో టెక్కీ భానురేఖ కార్ చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. అత్యవసర సేవల సిబ్బందితో కలిసి భానురేఖ కుటుంబంలోని ఐదుగురిని రక్షించారు. అయితే భానురేఖ నీటమునగడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమెను హుటాహుటీన స్థానికంగా ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే భానురేఖకు సరైన సమయంలో వైద్యం అందించలేదని..ఆసుపత్రికి వచ్చిన 30 నిమిషాల తర్వాత చికిత్స ప్రారంభించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై భానురేఖ సోదరుడు సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల నష్టపరిహారంతోపాటు ఆసుపత్రిలో చేరిన వారికి ఉచిత వైద్యం అందిస్తామని ఆయన ప్రకటించారు.