ఇదెక్కడి రూలయ్యా : ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. మీ కంపెనీకి చెబుతాం

ఇదెక్కడి రూలయ్యా : ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. మీ కంపెనీకి చెబుతాం

మీరు ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేస్తున్నారా..రోడ్లపై వేగంగా బైకులు, కార్లు నడుతుపుతున్నారా.. ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్, వేగంగా డ్రైవింగ్ చేస్తే.. చాలాన్లతోపాటు మీకు మరో ఇబ్బందికూడా వచ్చి పడుతుంది. ఏదైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడితే ట్రాఫిక్ పోలీసులు ఆ విషయాన్ని నేరుగా మీ కంపెనీలకు తెలియజేస్తారు. బెంగళూరులో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన టెకీలకు ఇదే పరిస్థితి ఎదురైందట.. టెకీలు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం గానీ, వేగంగా వాహనాలను నడుపుతూ పట్టుబడితే.. నేరుగా వారి కంపెనీలకు తెలుపుతున్నారట ట్రాఫిక్ పోలీసులు.

రోడ్డు భద్రత,ట్రాఫిక్ నియమాలపై అవగాహణ కల్పించే ప్రయత్నంలో భాగంగా బెంగళూరు ట్రాఫిక్  పోలీస్ ఈస్ట్ జోన్ విభాగం.. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ కారిడార్ లో స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించింది. ప్రస్తుతానికి ఈ స్పెషల్ డ్రైవ్ ను తూర్పు విభాగానికి మాత్రమే పరిమతం చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గినట్టయితే బెంగళూరులోని ప్రధాన ప్రాంతాలకు దీనిని విస్తరిస్తామని  పోలీసులు చెపుతున్నారు. 

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వ్యక్తి పనిచేస్తున్న కంపెనీనీ ధృవీకరించేందుకు వారి ఐడీ కార్డును తనిఖీ చేస్తాం..తద్వారా రైడ్ చేసిన వారి ఉల్లంఘటన జాబితాను కంపెనీకీ పంపిస్తామని ట్రాఫిక్ పోలీసులు చెపుతున్నారు. దేశంలోని చట్టాలను ప్రజలు పాటించేలా చూడటమే ఈ కార్యక్రమం లక్ష్యమని ట్రాఫిక్ పోలీస్ అధికారులు చెపుతున్నారు. 

టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ప్రచారం చేయాలని లేదా.. ట్రాఫిక్ నిబంధనలపై సెషన్ కోసం పోలీసులను ఆహ్వానించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.