ఏం ఆలోచిస్తున్నారో.. ఏంటో కూడా ఎవరికీ అర్థం కావటం లేదు. రేపటి గురించి వర్రీ ఎక్కువ అవుతుంది జనంలో.. నాలుగు మంచి మాటలు చెప్పేవాళ్లు.. భరోసా ఇచ్చే వాళ్లు లేకపోవటంతో చిన్న కష్టాన్ని కూడా ఒంటరి బతుకులు ఓర్చుకోలేకపోతున్నాయి. నేను లేకపోతే అనే ఆలోచన అన్నెంపుణ్యం ఎరుగని పిల్లలను చంపుతుంది. బెంగళూరు సిటీలో జరిగిన ఓ ఘోరం.. దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. భర్తకు ఉన్న గుండెజబ్బుతోపాటు నేను చనిపోతే నా కూతుర్ని ఎవరు చూసుకుంటారు అనే ఆందోళనతో.. 13 ఏళ్ల కుమార్తెను అత్యంత ఘోరంగా చంపి.. ఆ తర్వాత 45 ఏళ్ల ఆ తల్లి ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది. మానసిక రుగ్మతలు.. అవసరం లేని ఆందోళనలు దీనికి కారణం అని ప్రాథమికంగా పోలీసులు చెబుతున్నా.. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు పోలీసులు.
వైట్ ఫీల్డ్ లోని ఇమ్మడిహళ్ళిలోని ఓ ఇంట్లో సువర్ణ చంద్రశేఖర్ అనే 45 ఏళ్ళ మహిళ తన 13 ఏళ్ళ కూతురు తరుణ్య ముఖంపై దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి చంపేసి.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. సువర్ణ భర్త చంద్రశేఖర్ ఆమె మొబైల్‌కు పదేపదే ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో, తన తమ్ముడిని ఇంటికి రమ్మని చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అతను ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి బెడ్ రూమ్ కిటికీలోంచి తొంగి చూశాడు. అక్కడ, సువర్ణ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ, తరుణ్య మంచంపై పడి ఉన్నారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు చంద్రశేఖర్ తమ్ముడు. సువర్ణ తరుణ్యపై దిండును నొక్కి, ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుందని ప్రాధమికంగా నిర్దారించారు పోలీసులు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ కానీ..ఫోన్లో మెసేజెస్ కానీ లభించలేదని తెలిపారు పోలీసులు.
సువర్ణ డిప్రెషన్ లో ఉందని తెలిపారు ఆమె భర్త చంద్రశేఖర్. డిప్రెషన్ కారణంగానే సువర్ణ ఈ పని చేసిందని అంటున్నారు చంద్రశేఖర్. చంద్రశేఖర్ ITPL ప్రాంతంలో ఓకే ప్రైవేట్ హాస్పిటల్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నారు. తరుణ్య ఏడో తరగతి చదువుతోంది. చంద్రశేఖర్ కి గుండె జబ్బు ఉండటంతో సువర్ణ ఆందోళన చెందేదని.. తాను కూడా చనిపోతే తరుణ్యను ఎవరు చూసుకుంటారు అంటూ తరచూ ఆవేదన వ్యక్తం చేసేదని అంటున్నారు చంద్రశేఖర్.
చంద్రశేఖర్, సువర్ణ, తరుణ్య ముగ్గురు కలిసి సోమవారం రాత్రి ఒక రెస్టారెంట్లో భోజనం చేశారని.. రెస్టారెంట్‌కు వెళ్లే ముందు ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూశారని..రెస్టారెంట్ లో భోజనం చేసి ఇంటికి వచ్చాక తాను అలసిపోయానని, మరుసటి రోజు ఉదయం అల్పాహారం తయారు చేయనని సువర్ణ తనతో చెప్పిందని పోలీసుల విచారణలో తెలిపారు చంద్రశేఖర్. ఆ తర్వాత చంద్రశేఖర్ వేరే బెడ్ రూమ్ లో నిద్రపోయి, ఆఫీసుకు వెళ్లే ముందు బయట టిఫిన్ తీసుకెళ్లాడని తెలిపారు.

